హైదరాబాద్ లో 15 హాట్ స్పాట్లు..నిత్యావసరాలు ఇంటికే..

By రాణి  Published on  9 April 2020 1:34 PM GMT
హైదరాబాద్ లో 15 హాట్ స్పాట్లు..నిత్యావసరాలు ఇంటికే..

తెలంగాణ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఏ రోజుకారోజు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందన్న ఆశతో ఉంటే..ఆ ఆశలన్నీ అడియాశలైపోతున్నాయి. ప్రజలు కూడా లాక్ డౌన్ ను ఏ మాత్రం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. అదేమంటే ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉండాలని రుబాబుగా మాట్లాడుతున్నారట. బయటికి వెళ్లపోతే గల్లీలోనే క్రికెట్, కబడ్డీ, షటిల్ వంటి ఆటలాడుతున్నారు. ఈ రకంగా కూడా కరోనా వ్యాపిస్తుందని చెప్తే..వినేవారే కరువయ్యారు. అది ఎంత ప్రమాదమో తెలుసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 400 పైగా కరోనా కేసులుంటే..ఒక్క హైదరాబాద్ లోనే 175కి పైగా పాజిటివ్ కేసులున్నాయి. దీంతో అధికారులు ఏ ప్రాంతం నుంచి ఎక్కువకేసులొచ్చాయో గుర్తించి వాటిని హాట్ స్పాట్లుగా ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్. ముఖ్యంగా ఖైరతాబాద్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఖైరతాబాద్ గణేష్ చుట్టుపక్కలున్న రహదారులన్నింటినీ మూసివేసి..ఇది కరోనా నియంత్రణ ప్రదేశమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Also Read : క్వారంటైన్ లో పౌష్టికాహారం

అలాగే రామ్ గోపాల్ పేట, షేక్ పేట, రెడ్ హిల్స్, మలక్ పేట- సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట. అల్వాల్, మూసాపేట, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్- గాజుల రామారం, మయూరినగర్, యూసుఫ్ గూడ్, చందానగర్, బాలాపూర్, చూగూరు, తుర్కపల్లి ప్రాంతాలను క్లస్టర్ కంటైన్మెంట్ లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు బయటికివెళ్లకూడదు. బయటి వారు ఈ ప్రాంతాలకు రాకూడదు. అంటే పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయనమాట.

నిత్యావసర సరుకులు కావాలంటే జీహెచ్ఎంసీ ద్వారానో..ఆన్ లైన్ లోనే ఇళ్లకే పంపిస్తామని చెబుతున్నారు. మొత్తం 175 కేసుల్లో 89 కేసులు ఈ హాట్ స్పాట్ ప్రాంతాల్లోనివే. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటికి రావొద్దని హెచ్చరించారు. ఈ హాట్ స్పాట్ ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తారు.

Also Read :అతలాకుతలమైన రైతన్న..

Next Story