పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. క్రీజులో అలా నిలబడడం చూసి అంతా షాక్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 7:32 AM GMT
పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. క్రీజులో అలా నిలబడడం చూసి అంతా షాక్..!

ఫవాద్ ఆలమ్.. పాకిస్థాన్ క్రికెటర్ 11 ఏళ్ల విరామం.. కరెక్ట్ గా చెప్పాలంటే 3910 రోజుల తర్వాత మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. 88 టెస్ట్‌లు తర్వాత ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌‌తో జట్టులోకి తిరిగి వచ్చాడు. చివరిసారిగా 2009‌ నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడిన ఫవాద్ ఆలమ్.. పాకిస్థాన్ జట్టు 88 మ్యాచ్‌లు ఆడిన తర్వాత అవకాశం దక్కింది. ఇంత సమయం రీఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఫవాద్ ఏడో స్థానంలో నిలిచాడు. పాక్ నుంచి యూనీస్ మహ్మద్ 104 టెస్టుల తర్వాత స్థానం సంపాదించుకున్నాడు. అతడి తర్వాత ఫవాద్ నిలిచాడు. తొలి 3 టెస్టుల్లో 1 సెంచరీ సహా 41.66 సగటుతో 250 పరుగులు చేసినా మళ్లీ టెస్టు ఆడే అవకాశం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాణించడంతో మళ్లీ దేశం తరఫున టెస్టు ఆడాడు.

142 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గారెత్ బ్యాటీ అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌కే చెందిన మార్టిన్ బిక్‌నెల్(114), వెస్టిండీస్ క్రికెటర్ ఫ్లైడ్ రీఫర్(109), పాకిస్థాన్ ప్లేయర్ యూనీస్ మహ్మద్(104), ఇంగ్లండ్ ఆటగాళ్లు డెరెక్ షెకెలెటన్(103), లెస్ జాక్సన్(96) ఫవాద్ కన్నా ముందున్నారు.

అన్ని రోజుల తర్వాత జట్టులో స్థానం సంపాదించుకున్న ఫవాద్ ఆలమ్ బ్యాటింగ్ స్టాన్స్ విషయంలో కూడా వార్తల్లో నిలిచాడు. పూర్తిగా వికెట్లను వదిలేసి.. ఒకవైపు నిలబడి ఉండి వైవిధ్యంగా నిలబడ్డాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.. కేవలం నాలుగంటే నాలుగు బంతులు ఆడి తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్‌’గా వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు.

మొదటిరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆబిద్‌ అలీ (111 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. బాబర్‌ ఆజమ్‌ (25 బ్యాటింగ్‌), రిజ్వాన్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు 45.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

Next Story