పాక్‌కు క్రిప్టో కరెన్సీ అందుతుందా.. ఎఫ్‌ఏటీఎఫ్ కీలక వ్యాఖ్యలు
By Newsmeter.Network
పాకిస్థాన్ 'గ్రే లిస్ట్' పై కీలక నిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఎఫ్‌ఏటీఎఫ్( ఆర్థిక చర్యల కార్యదళం) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా.. ఉగ్రవాద సంస్థలకు ఇంకా అక్రమ మార్గాల ద్వారా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. పాకిస్థాన్ ను 'గ్రే లిస్ట్' లో ఉంచాలా లేక 'బ్లాక్ లిస్ట్'లో చేర్చాలా లేదా మొత్తానికి ఆంక్షల పరిధి నుంచి తొలగించాలా అన్న విషయం పై ప్యారిస్‌లో వారం రోజుల పాటు ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశాలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఎఫ్‌ఏటీఎఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐసీల్, ఆల్‌ఖైధా వంటి ఉగ్రసంస్థలకు.. క్రిప్టో కరెన్సీ వంటి అత్యాధునిక మార్గాల ద్వారా నిధులు అందుతున్నాయని వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అక్రమ నగదు చలామణి, ఉగ్రసంస్థలకు నిధులు సమకూరడం.. వీటిని ఆరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
39 దేశాలున్న ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్ 'గ్రే లిస్ట్' నుంచి తప్పించుకొని 'వైట్ లిస్ట్'లో చేరడానికి 15-16 దేశాల మద్దతు అవసరం. 'బ్లాక్ లిస్ట్' నుంచి తప్పించుకోవాలంటే.. మూడు దేశాల మద్దతు అవసరం. అయితే.. పాకిస్థాన్ మాత్రం ఎఫ్‌ఏటీఎఫ్ నిర్దేశించిన లక్ష్యాల మేరకు కొన్ని చర్యలు చేపట్టినట్లు చెబుతోంది. ముంబాయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష విధించడం జరిగిందని, మరో ఉగ్రవాది మసూద్ అజార్ ఆచూకి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతోంది. ఐరాస(ఐక్యరాజ్యసమితి) ఉగ్రవాదులుగా ముద్రవేసిన 16మందిలో ఏడుగురు చనిపోయారని, మరో తొమ్మిది మందిలో ఏడుగురు తమని జాబితా నుంచి తొలగించాలని ఐరాసకు దరఖాస్తు చేసుకున్నారని ఎఫ్‌ఏటీఎఫ్ వివరించింది.
ఎఫ్ఏటీఎఫ్ - ఏమిటీ సంస్థ?
ఎఫ్ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ, దీనిని జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీ ల్యాండరింగ్‌ను ఎదుర్కోడానికి ఇది విధానాలు రూపొందిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా ఇది విధానాలు రూపొందిస్తుంది. వాటిని అమలు చేసే దిశగా పనిచేస్తుంది. 2001లో ఇది తీవ్రవాదం, వారికి నిధులు అందించడాన్ని కూడా తన విధానాల్లో చేర్చింది. భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా సహా ఎఫ్ఏటీఎఫ్‌లో మొత్తం 39 సభ్య దేశాలు ఉన్నాయి.