ఫతేపూర్ లో మరో ''దిశ'' ఘటన
By రాణి Published on 15 Dec 2019 4:51 PM ISTలక్నో : దిశ హత్యాచార ఘటనను మరిపించే ఉదంతం యూపీలోని ఫతేపూర్‌లో వెలుగుచూసింది. 18 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను సజీవ దహనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 90 శాతం కాలిన గాయాలతో బాధితురాలు కాన్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కమలేష్ గౌతమ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫతేపూర్ ఘటన దురదృష్టకరమని, అత్యంత హేయమని అన్నారు. నిందితుడు గోడ దూకి యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పారు. నిందితుడు మెవాలాల్‌ని శనివారం సాయంత్రం ఘటన జరిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు కమలేష్ వెల్లడించారు.
ఫతేపూర్ బాదితురాలి కేసులో నిందితుడైన మెవాలాల్ ను అరెస్ట్ చేశామని, ఆధారాలు లభ్యమైన వెంటనే అతడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఉబిపూర్ గ్రామంలో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలోనే పొరుగింట్లో ఉండే మెవాలాల్ అదనుచూసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడన్నారు. ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేయడమే కాకుండా కిరోసిన్ పోసి నిప్పంటించాడని వెల్లడించారు. కాగా గతంలో సదరు నిందితుడు బాధితురాలిని వివాహం చేసుకోవాలని భావించగా, యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. శనివారం ఉదయం ఈ విషయమై గ్రామంలో పంచాయతీ జరుగుతుండగానే బాధితురాలి ఇంటికి వెళ్లిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించడం గమనార్హం.