ఫాస్టాగ్ ఇంకా స్లోనే గురూ

By సుభాష్  Published on  23 Jan 2020 8:58 AM GMT
ఫాస్టాగ్ ఇంకా స్లోనే గురూ

టోల్ ప్లాజాల దగ్గర వేగవంతంగా టోల్ చెల్లించి వెళ్లిపోవడానికి వీలు కల్పించే ఫాస్టాడ్ అమలులోకి వచ్చి దాదాపు వారం పూర్తయింది. కానీ ఇప్పటికీ ఫాస్టాగ్ స్లోగానే ఉంది. ఇప్పటికీ తెలంగాణలో కేవలం 60 శాతం వాహనదారులు మాత్రమే ఫాస్టాగ్ లో నమోదయ్యారు. ఇప్పటికీ నలభై శాతం వరకూ కార్ల యజమానులు ఫాస్టాగ్ కి దూరంగానే ఉన్నారు.

ప్రతి వాహనం ఎలక్ట్రానిక్ వివరాలు అధికారులకు తెలిసేందుకు, టోల్ చెల్లింపులను వేగవంతం చేసేందుకు, నేరం చేసి పారిపోతున్న నేరగాళ్ల కదలికలను గమనించేందుకు ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి ఫాస్టాగ్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సారి టోల్ ప్లాజా దగ్గర ఆగి, రుసుము చెల్లించి, చిల్లర సరిచూసుకుని సమయం వేస్ట్ చేయడానికి బదులు నేరుగా వెళ్లడానికి ఇది వీలు కల్పిస్తుంది. టోల్ రుసుమును ఆన్ లైన్ లో మన అకౌంట్ల నుంచే తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

అయితే ఇప్పటి వరకూ అరవై శాతం వాహనాలే ఫాస్టాగ్ లో నమోదయ్యాయి. మిగతావి ఎందుకు కాలేదు? చాలా వాహనాలకు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న వాహనదారులకు అసలు ఊరు విడిచి బయటకు వెళ్లే అవసరమే ఉండదు. వారి రోజులు నగరంలోనే గడిచిపోతున్నాయి. ఎప్పుడో ఒకసారి మాత్రం నగరం బయటకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వారికి ఫాస్టాగ్ వల్ల పెద్ద ఉపయోగం కనిపించడం లేదు. వారు టోల్ ప్లాజా వద్ద క్యాష్ చెల్లింపులే చేస్తున్నారు.

మొదట్లో ఫాస్టాగ్ గడువు డిసెంబర్ 15 గా నిర్ణయించారు. అప్పటికి 15 శాతం మాత్రమే నమోదు చేసుకున్నారు. ఆ తరువాత జనవరి 15 వరకూ గడువును పొడిగించారు. ఈ సమయంలో దాదాపు 60 శాతం వరకూ ఫాస్టాగ్ లో నమోదయ్యారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా చాలా మంది హైవేని ఉపయోగించాల్సి వచ్చింది. తమ తమ ఊళ్లకు కార్లలో వెళ్లేవారందరూ ఫాస్టాగ్ లో నమోదు చేసుకున్నారని అధికారులు అంటున్నారు.

నెలకి ఒక పది శాతం వాహనదారులు ఫాస్టాగ్ లో నమోదవుతున్నారని, ఈ లెక్కన మరో మూడునాలుగు నెలల్లో నూటికి నూరు శాతం నమోదవుతారని అధికారులు భావిస్తున్నారు.

Next Story