ఇటలీ అధ్యక్షుడు కన్నీరు పెట్టలేదు.. అది ఫేక్
By అంజి Published on 23 March 2020 5:01 PM GMTఇటీవల నెట్టింట్లో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. అది మరేదో కాదు. ఇటలీలో కరోనా వైరస్ ప్రభావంతో రోజుకు వేలాది మంది ఆస్పత్రుల పాలవుతుండగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా చూస్తూ ఉండటమే తప్ప..ఏమీ చేయలేక ఇటలీ అధ్యక్షుడు కంటతడి పెట్టుకున్నారంటూ ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేసింది. నిజానికి అది ఇటలీ అధ్యక్షుడి ఫొటో కాదు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ ఫొటో. ఆయన ఏడ్చింది కూడా ఇప్పుడు కాదు..అసలేం జరిగిందో తెలుసుకుందాం.
“కన్నీరు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు
రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు
శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్లను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు
కేవలం 6కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తి బోరున విలపించాడు” అంటూ ఫొటో వైరల్ అయింది.
ఇప్పుడు ఆ ఫొటో ఫేక్ అని, అది నిజానికి ఇటలీ అధ్యక్షుడి ఫొటో కాదని తేలిపోయింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో డిసెంబర్ 17,2019న బ్రెజిల్ లోని పలాసియో డో ప్లానాల్టోలో జరిగిన థాంక్స్ గివింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 2018లో అధ్యక్ష పదవికి పోటీలో ఉండగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రచారంలో జైర్ ను ఓ దుండగుడు కత్తితో పొడిచి పరారయ్యాడట. తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన జైర్ బోల్సోనార్ కు ఆ సమయంలో తన కూతురు తప్ప ఎవరూ గుర్తు రాలేదట. తన ప్రాణాలు తీసుకున్నా ఫర్వాలేదు కానీ..తన ఏడేళ్ల కూతుర్ని మాత్రం అనాధను చేయొద్దంటూ వేడుకున్నారట. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్న జైర్ బోల్సోనార్ కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి ఫొటోను కాస్త.. ఇప్పుడు కరోనా వ్యాప్తి ని చూసి ఇటలీ అధ్యక్షుడు ఏడుస్తున్నారంటూ పుకార్లు పుట్టించేశారు. పుకార్లు పుట్టించడంలో మనకన్నా తోపులెవరున్నారు చెప్పండి.
ఇప్పటికైనా ఫేక్ వార్తలను వైరల్ చేయడం మానండి. ఇలాంటి అసత్య వార్తల కారణంగానే కరోనా పై ప్రజలు భయాన్ని వీడట్లేదు. చికెన్, మటన్ తింటే కరోనా వస్తుందని వార్తలు ప్రచారం చేయడంతో..నాన్ వెజ్ ప్రియులు సైతం వాటి జోలికి వెళ్లట్లేదు.