నకిలీ పాసు పుస్తకాల కేసులో అరెస్టైన‌ ధర్మారెడ్డి ఆత్మహత్య

By సుభాష్  Published on  8 Nov 2020 4:47 AM GMT
నకిలీ పాసు పుస్తకాల కేసులో అరెస్టైన‌ ధర్మారెడ్డి ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కీసరలో నకిలీ పాస్‌పుస్తకాల కేసులు అరెస్టు అయిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ ధర్మారెడ్డి (80) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవలే బెయిలుపై జైలు నుంచి విడులైన ధర్మారెడ్డి కుషాయిగూడ వాసవీశవనగర్‌ కాలనీలో చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాజీ తహసీల్దారు నాగరాజు ద్వారా ధర్మారెడ్డి కుటుంబం 40 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు తీసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా అసలు నిజాలు బయట పడటంతో ధర్మారెడ్డిని అరెస్టు చేశారు.

ఈ కేసులో అరెస్టు అయి 33 రోజుల పాటు జైలులో ఉన్నధర్మారెడ్డి ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డికి మాత్రం ఇంకా బెయిలు మంజూరు కాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల 14న కీసర మాజీ తహసీల్దారు నాగరాజు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే.

కాగా, కీసర మండలం రాంపల్లి దాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 604 నుంచి 614 వరకు గల కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (గవర్నమెంట్‌ కస్టోడియన్‌ ల్యాండ్‌) 53 ఎకరాల భూముల్లో 28 ఎకరాల భూమిని ధర్మారెడ్డి కుటుంబంతో పాటు మరి కొందరి పేరిట నకిలీ పాస్‌ పుస్తకాలు జారీ చేసేందుకు తహసీల్దారు నాగరాజుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ధర్మారెడ్డి నుంచి నాగరాజు రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ సెప్టెంబర్‌లో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నకిలీ పట్టా పాస్‌ పుస్తకాల కేసులో ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడిని ఏసీబీ అధికారులు సెప్టెంబర్‌ 29న అరెస్టు చేశారు. ఇటీవలే ధర్మారెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు.

Next Story