బాబోయ్.. హమ్ మందు నహీ తో బతుకు నయ్ సక్తా హై.!
By రాణి Published on 29 Jan 2020 12:56 PM ISTవాతావరణ మార్పుల వల్ల మనం అంగుళం అంగుళం చొప్పున ప్రళయానికి దగ్గరైపోతున్నాం. కరిగే హిమానీనదాలు, పెరిగే సముద్ర మట్టాలు, రెచ్చిపోతున్న ఉష్ణోగ్రతలు, చచ్చిపోతున్న జీవజాతులు ఇవన్నీ రానున్న ప్రమాదానికి ముందస్తు సంకేతాలు. ఇప్పుడు మందుభాయిల గుండెల్ని పిండేసే మరో వాతావరణ సత్యం బయటకొచ్చింది. ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే వారికి తాగేందుకు మందు దొరకదు. అవునండీ... మనందరి మత్తు వదిలించే నిజం ఇది.
ప్రపంచమంతా ఎంతో ప్రయత్నం చేసి కర్బన ఉద్గారాలను తగ్గించినా, వాహన కాలుష్యాన్ని అదుపు చేసినా రెండు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ప్రపంచంలో ద్రాక్ష పండే ప్రదేశాల్లో 56 శాతం భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. దీని వల్ల ద్రాక్ష సారా తయారీ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ద్రాక్ష సారా లేకపోతే వైన్ ఇండస్ట్రీ ఘోరంగా దెబ్బతింటుంది. అదే నాలుగు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరిగితే 85 శాతం ద్రాక్ష పంటలు నాశనమైపోతాయి. ప్రపంచంలోని వైన్ పరిశ్రమ ఏకంగా కుదేలవుతుంది. పలు రకాల ద్రాక్ష వంగడాలు నాశనమైపోతాయి. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వెరైటీల అంతరించిపోతాయి. కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే వెరైటీలను పెంచడం వల్ల 24 శాతం వరకూ నష్టాన్ని నివారించవచ్చు.
స్పెయిన్ లోని అల్కలా యూనివర్సిటీ, వాంకూవర్ లోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా 11 ద్రాక్ష వెరైటీలపై జరిపిన పరిశోధనల్లో ఈ ఆందోళనకరమైన వాస్తవం బయటకి వచ్చింది. ఒక వైపు వాతావరణ మార్పులను నియంత్రిస్తూనే, ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే వంగడాల వాడకాన్ని పెంచాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. అదే సమయంలో ద్రాక్ష తోటల చుట్టూ వస్త్రాలను చుట్టడం ద్వారా, పరదాలు అమర్చడం ద్వారా వాతావరణ ఉష్ణోగ్రతను తోటల వద్ద కాస్త తగ్గించవచ్చునని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బాబోయ్... మందు లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా? అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణ సునీల్ కి చెప్పినట్టు “హమ్ తిండి నహీ బతుకు సక్తాహై... కానీ హమ్ మందు నహీ తో బతుకు నయ్ సక్తా హై.!