నిజ నిర్ధారణ: పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు ఎప్పుడైనా తిరిగిరావొచ్చా.?

By Newsmeter.Network  Published on  26 Dec 2019 5:04 AM GMT
నిజ నిర్ధారణ: పాకిస్తాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు ఎప్పుడైనా తిరిగిరావొచ్చా.?

ముఖ్యాంశాలు

  • గాంధీజీ ఈ మాట చెప్పారా ?
  • మోదీ ప్రసంగంలో గాంధీ ప్రస్తావన నిజమేనా ?

"పాకిస్తాన్‌లో ఉంటున్న హిందూ, సిక్కు సోదరులు ఎప్పుడు భారత్ రావాలని అనుకున్నా, వారికి స్వాగతం పలుకుతాం అన్నారు. ఇది నేను అనడం లేదు. పూజ్యులు మహాత్మా గాంధీ చెప్పారు. ఆ సమయంలో ప్రభుత్వ వాగ్దానం ప్రకారమే ఈ చట్టం చేశాం" అన్నారు ప్రధాని నరేంద్రమోదీ.

ఈనెల 22వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ ప్రస్తావన చేశారు. అయితే.. ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో ఇక్కడ ప్రస్తావనార్హం.

దేశంలో ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. విపక్షాలు సహా సామాజిక, విద్యార్థి, మహిళా సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో హింస చెలరేగింది. ఆయా యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో ముస్లింలను అణగదొక్కేందుకు, దేశం నుంచి బయటకు పంపించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. అయితే.. వాస్తవానికి పొరుగు దేశాల్లో ఇక్కట్లు పడుతున్న హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది. కానీ, భారతదేశంలోని ముస్లింలను బయటకు పంపించేందుకు పౌరసత్వ సవరణ చట్టం తెచ్చారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది.

నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది 1955 పౌరసత్వ చట్టమునకు సవరణ తేవడానికి ఉద్దేశించిన బిల్లు. దీనిప్రకారము పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు.. ఆఫ్ఘనిస్థాన్‌ల నుండి భారత దేశానికి వలస వచ్చే 'ముస్లిమేతరులకు' పౌరసత్వము ఇస్తారు. ఆయా దేశాలలో మతపరమైన దాడుల నుండి తప్పించుకోవడానికి దేశములోనికి వచ్చే వారి కోసం ఈ బిల్లును తెచ్చామని అధికార బీజేపీ చెబుతోంది. 2019 డిసెంబరు 9న లోక్‌సభలో 80 మంది వ్యతిరేకంగా 311 మంది మద్దతుగా ఓటేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తరువాత రాజ్యసభలో 105 మంది వ్యతిరేకంగా, 120 మంది అనుకూలంగా ఓటు వేయడంతో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు చట్టంగా మారింది. కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఈమేరకు రాజపత్రం(గెజిట్) విడుదల చేసింది . ప్రస్తుతం ఈ బిల్లు చట్టంగా మారడంతో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు.. ఆఫ్ఘనిస్థాన్‌లలో హింసకు గురై 2014 డిసెంబర్, 31కి ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు నిబంధనల ఆధారంగా ఇక్కడి పౌరసత్వం కల్పించనున్నారు. అయితే రాజ్యాంగంలోని షెడ్యూల్ ఆరు కిందికి వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. బెంగాల్ ఈస్ట్రన్, ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1773 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ కిందకు వచ్చే ప్రాంతాలకు కూడా ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చారు. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాల వారికి పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తోంది.

రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ

ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఈనెల 22వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సభలో నరేంద్రమోదీ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం గురించి పలు అంశాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను తీవ్రంగా విమర్శించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన మహాత్మాగాంధీ చేశారంటూ పై ప్రకటనను చేశారు. ఈ ప్రకటనను ప్రస్తావించిన నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కోరుకున్నారని విపక్షాలకు, దేశానికి వివరణ ఇచ్చారు.

అయితే..మోదీ చేసిన ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చజరుగుతోంది. మహాత్మాగాంధీ పేరు చెప్పి నరేంద్రమోదీ తన సొంత ఆలోచనలు అమలు చేస్తున్నారన్న విమర్శలు కూడా విపక్షాల నుంచి వినిపించాయి. ఇది అంతా అబద్ధమని, గాంధీజీ పేరు చెప్పి మోదీ.. ఏదో ఒక ప్రస్తావన చేశారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

నిజ నిర్ధారణ:

ఈ నేపథ్యంలోనే.. దీనిపై న్యూస్‌ మీటర్‌ బృందానికి ఫ్యాక్ట్‌ చెక్‌ అనివార్యమనిపించింది. ఎందుకంటే.. దేశం మొత్తం అట్టుడికిపోతున్న సమయంలో.. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపైనే దుమారం రేగుతున్న సందర్భంలో వాస్తవం ఏమిటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే అంశంపై పరిశోధన సాగిస్తున్న క్రమంలో మహాత్మాగాంధీ ప్రసంగాలు, రచనలను శోధించగా ఆన్‌లైన్‌ లైబ్రరీలో దీనికి సంబంధించిన వాస్తవం బయటపడింది.

గాంధీ సేవాశ్రమ్‌ క్రోడీకరించిన The Collected Works of Mahatma Gandhi అనే ఆన్‌లైన్‌ లైబ్రరీలో ఈ ప్రస్తావన కనిపించింది. వాల్యూమ్‌ 89లో మహాత్మాగాంధీ చేసిన ఈ ప్రకటన ఉంది. 1947 సెప్టెంబర్ 26న స్వాతంత్ర్యం వచ్చిన ఒక నెల తర్వాత ప్రార్థన సభలో మహాత్మాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

" భారత్‌లో ఉంటున్న నాలుగున్నర కోట్ల మంది ముస్లింలు దొంగచాటుగా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే, వాళ్లను కాల్చిచంపాలని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడను. అదేవిధంగా పాకిస్తాన్‌లో ఉంటున్న సిక్కులు, హిందువులు అలా చేస్తే, వాళ్లను కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. మనం పక్షపాతం చేయలేం.’’ అన్నారు మహాత్మాగాంధీ.

దీంతో పాటు.. ఈప్రస్తావన కూడా చేశారు మహాత్మాగాంధీ.

''పాకిస్తాన్‌లో ఉంటున్న హిందువులు, సిక్కులు ఆ దేశంలో ఉండకూడదని అనుకుంటే, తిరిగి రావచ్చు. ఆ పరిస్థితుల్లో వారికి ఉపాధి కల్పించి, వారి జీవితం సౌకర్యంగా ఉండేలా చూడడం, భారత ప్రభుత్వం మొదటి బాధ్యత అవుతుంది. కానీ వారు పాకిస్తాన్‌లో ఉంటూ భారత్ కోసం గూఢచర్యం చేయడం, మన కోసం పనిచేయడం లాంటివి కుదరదు. అలా ఎప్పటికీ జరక్కూడదు. అలా చేసేవారికి నేను పూర్తిగా వ్యతిరేకం" అని గాంధీ చెప్పారు.

Fact checking

గాంధీ సేవాశ్రమ్‌ క్రోడీకరించిన The Collected Works of Mahatma Gandhi అనే లింక్‌లో ఉన్న గ్రంథం నుంచి ఈ ఆధారాన్నితీసుకోవడమైనది.

నవంబర్‌ 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో గాంధీజీని ప్రస్తావించిన వ్యాఖ్యలు వాస్తవమే. The Collected Works of Mahatma Gandhi అనే గ్రంథం నుంచి తీసుకున్న వాల్యూమ్‌లో ఈ ప్రస్తావన ఉంది. కాబట్టి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో మహాత్మాగాంధీ స్వయంగా చెప్పినట్లు చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వాస్తవమే.

ప్రచారం : మహాత్మాగాంధీ చెప్పినట్లు ప్రస్తావిస్తూ ప్రధానిమోదీ చేసిన వ్యాఖ్యలు నిజం కాదు.

వాస్తవం : 1947 సెప్టెంబర్ 26న అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఒక నెల తర్వాత ప్రార్థన సభలో మహాత్మాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కంక్లూజన్‌ : పాకిస్తాన్‌లో ఉన్నహిందువులు, సిక్కులు ఎప్పుడైనా తిరిగిరావొచ్చు. వారికి ఉపాధి కల్పించి, వారి జీవితం సౌకర్యంగా ఉండేలా చూడడం, భారత ప్రభుత్వం మొదటి బాధ్యత అవుతుంది. అని చెప్పిన మహాత్మాగాంధీ.

Notes : గాంధీ సేవాశ్రమ్‌ క్రోడీకరించిన The Collected Works of Mahatma Gandhi అనే లింక్‌లో ఉన్న గ్రంథాల నుంచి ఈ ఆధారాలను తీసుకోవడమైనది. (మహాత్మాగాంధీ ప్రసంగాల నుంచి తీసుకున్న ఇమేజ్‌ల లింక్‌)

https://www.gandhiservefoundation.org/about-mahatma-gandhi/collected-works-of-mahatma-gandhi/076-19420401-19421217/

- సుజాత గోపగోని

Next Story
Share it