గులాబీ కండువా కప్పుకుని చికెన్, మద్యం పంచుతున్న వ్యక్తి బీజేపీకి చెందిన వాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
చికెన్, మద్యం పంచే నాయకుడే తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఫేస్‌బుక్ యూజర్ వీడియోను షేర్ చేశారు.
పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో ఈ ఘటన చోటు చేసుకుందని.. మరొక యూజర్ పోస్టు పెట్టాడు.
పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. వైరల్ వీడియో కు సంబంధించిన స్క్రీన్‌షాట్ కలిగి ఉన్న హిందూస్తాన్ టైమ్స్ అక్టోబర్ 4 కథనాన్ని మా బృందం చూసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభించే ముందు టిఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి స్థానికులకు మద్యం బాటిళ్లు, చికెన్ పంచుతూ కనిపించారు.
ANI కూడా అక్టోబర్ 4 న వైరల్ వీడియోను ట్వీట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభించే ఒక రోజు ముందు టిఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్‌లో మద్యం సీసాలు, చికెన్ పంపిణీ చేశారని పేర్కొంది. పలు జాతీయ మీడియా సంస్థలతో పాటూ తెలుగు మీడియాలో కూడా ఆయన చేసిన పనిని చూపించారు.
కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు, దేశానికి ప్రధాని అవ్వాలని కోరుతూ.. వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
విజయదశమి కేసీఆర్ కుటుంబానికి విజయాలను సాధించి పెట్టాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరంగల్ చౌరస్తాలో హమాలీలకు ఒక కోడి, ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ని పంపిణీ చేశారు.రాజనాల శ్రీహరి చేపట్టిన ఈ కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. బహిరంగంగా మద్యం పంపిణీ చేయడంపై విమర్శలు వచ్చాయి.
ఈ వీడియోలో కనిపిస్తున్న నాయకుడు టీఆర్‌ఎస్‌కు చెందిన రాజనాల శ్రీహరి.. ఆ వీడియో తెలంగాణలోని వరంగల్‌కు చెందినదని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.