నిజమెంత: గోల్డీ బ్రార్ షూటౌట్‌కు సంబంధించిన వీడియో అంటూ వైరల్ అవుతున్న పోస్టులు.. అసలు నిజం ఏమిటంటే?
సిద్ధూ మూసేవాలా హత్య వెనుక మాస్టర్ మైండ్ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా నెట్టింట వైరలవుతున్నాయి.
By అంజి Published on 3 May 2024 2:05 PM GMTనిజమెంత: గోల్డీ బ్రార్ షూటౌట్‌కు సంబంధించిన వీడియో అంటూ వైరల్ అవుతున్న పోస్టులు.. అసలు నిజం ఏమిటంటే?
గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వెనుక మాస్టర్ మైండ్ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
మంగళవారం కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో గ్యాంగ్ వార్ కాల్పుల్లో గోల్డీ బ్రార్ చనిపోయారంటూ వార్తలను కొన్ని మీడియా సంస్థలు వైరల్ చేశాయి. యుఎస్‌లోని పోలీసులు మరణించిన వ్యక్తి గుర్తింపును ప్రకటించకముందే, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చనిపోయారనే పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కొన్ని గంటలు ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
గోల్డీ బ్రార్ మరణానికి దారితీసిన షూటౌట్ కు సంబంధించిన CCTV ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
30 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక SUV ఒక వీధి చివరకు చేరుకోవడం.. హూడీలో ఉన్న వ్యక్తి కదులుతున్న వాహనం నుండి బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లు చూడొచ్చు. ఆ తర్వాత షూటర్ వేగంగా తిరిగి కారులోకి ప్రవేశించాడు, అది అక్కడి నుండి వెళ్లిపోతుంది.
X లో వీడియోను షేర్ చేస్తూ, ఒక వినియోగదారు “#SidhuMooseWala హత్య వెనుక సూత్రధారి, గోల్డీ బ్రార్, కాలిఫోర్నియాలో కాల్చి చంపబడ్డాడు… డల్లా లఖ్వీర్ ముఠా ఈ పని చేసిందంటూ అనుమానాలు ఉన్నాయి." అనే అర్థం వచ్చేలా హిందీలో పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
USAలోని న్యూ ఓర్లీన్స్‌లో జూలై 30, 2023 నాటి సంఘటనను ఈ వీడియో చూపుతుందని NewsMeter కనుగొంది. ఇది గోల్డీ బ్రార్‌కి సంబంధించినది కాదు.
మేము వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. జూలై 31, 2023న ప్రచురించిన Fox 8 నివేదికలో అదే క్లిప్‌ను కనుగొన్నాము. వీడియో టైటిల్ లో (‘VIDEO: Two women injured in hail of gunfire in 7th Ward.’) ‘వీడియో: 7వ వార్డులో తుపాకీ కాల్పుల్లో ఇద్దరు మహిళలు గాయపడ్డారు.’ అని ఉంది.
మేము జూలై 30, 2023న స్థానిక వార్తా సంస్థ 4WWL నివేదికను కూడా కనుగొన్నాము. న్యూ ఓర్లీన్స్‌లోని ఇండస్ట్రీ స్ట్రీట్‌లోని 1800 బ్లాక్‌లో కాల్పుల ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారని నివేదిక పేర్కొంది. ఈ కాల్పుల్లో 76, 36 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వారికి ప్రాణాపాయం లేదని నివేదికలో తేలింది.
మేము WDSU న్యూస్ యూట్యూబ్ ఛానెల్ వివరణలో ముష్కరులు కాల్పులు జరిపిన తర్వాత ఇండస్ట్రీ స్ట్రీట్‌లో ఇద్దరు మహిళలకు గాయాలైనట్లు వీడియో చూపిస్తుంది. WSDU న్యూస్ వివరణాత్మక నివేదికలో అదే సంఘటన గురించి తెలియజేస్తోంది.
గోల్డీ బార్ మరణం వార్తలపై US పోలీసులు
కాలిఫోర్నియాలో గోల్డీ బ్రార్‌ను కాల్చి చంపినట్లు వచ్చిన వార్తలను అమెరికా పోలీసులు ఖండించారు. ఇండియా టుడే ‘గోల్డీ బ్రార్ హత్యకు సంబంధించిన నివేదికలను US పోలీసులు ఖండించారు’ అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య వెనుక ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను కాలిఫోర్నియాలో కాల్చి చంపారని వచ్చిన వార్తలను US పోలీసులు ఖండించారని పలు మీడియా నివేదికలు వచ్చాయి.
మే 2న ప్రచురించిన ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. మే 2న సోషల్ మీడియాలో గోల్డీ మరణం గురించి పుకార్లు వచ్చాయి, బ్రార్ క్లబ్ గొడవలో కాల్పుల్లో మరణించాడని వదంతులు వ్యాపించాయి. ఫ్రెస్నో పోలీసు విభాగానికి చెందిన లెఫ్టినెంట్ విలియం జె.డూలీ ఆన్‌లైన్ లో వైరల్ అవుతున్న పుకార్లను కొట్టివేస్తూ ఫ్రెస్నో కాల్పుల బాధితుడు బ్రార్ కాదని స్పష్టం చేశారు. మంగళవారం కాలిఫోర్నియాలో ఫ్రెస్నోలో గ్యాంగ్ వార్ కాల్పుల్లో గ్లాడ్నీ జేవియర్ అనే వ్యక్తి మరణించాడు. అయితే ఈ వార్త ఇండియాకు వచ్చేసరికి గోల్డీ అయిపోయింది. యుఎస్‌లోని పోలీసులు మరణించిన వ్యక్తి గుర్తింపును ప్రకటించకముందే, సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి.
మే 2022లో భారతదేశంలోని పంజాబ్‌లో పంజాబీ కళాకారుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు.
వైరల్ అవుతున్న షూటింగ్ వీడియో గోల్డీ బ్రార్‌కి సంబంధించినది కాదని స్పష్టమైంది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. గోల్డీ బ్రార్ చనిపోయాడని అమెరికా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ని కాల్చి చంపినట్లు వీడియో చూపిస్తుంది.