ఉత్తర కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా నుండి దుప్పట్లు అమ్మేవారిగా నటిస్తూ దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారని, ఇటీవల ఢిల్లీ పోలీసులు 'ఇరానియన్ గ్యాంగ్' గురించి నోటీసు జారీ చేశారని పేర్కొంటూ 26 మంది వ్యక్తుల ఫోటోలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ పోస్ట్‌లు ప్రజలను వారి కమ్యూనిటీల్లో సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నాయి. దుప్పట్లు అమ్మే వారి తరహాలో ఓ ముఠా పగటిపూట ఇళ్లను సర్వే చేస్తుందని.. ఆపై రాత్రికి తిరిగి వచ్చి దోచుకుంటారని వైరల్ మెసేజీ ద్వారా హెచ్చరించారు.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు సదరు వ్యక్తులకు సంబంధించిన కోల్లెజ్‌ని షేర్ చేసి “వీరు బీదర్, గుల్బర్గా నుండి వచ్చిన ఇరానియన్ వ్యక్తులు. దుప్పట్లు అమ్ముతున్నట్లు నటిస్తున్నారు, కానీ వారందరూ గ్యాంగ్‌స్టర్లు. దయచేసి గమనించండి. పగటిపూట ముఠా సభ్యులు దుప్పట్లు అమ్మేవారిగా నటిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. చివరికి ఇంటిని దోచుకుంటున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ దీన్ని తమ తమ గ్రూపులలో పంచుకోవాలని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు." అంటూ పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
2019లో మంగళూరు పోలీసులు జారీ చేసిన నోటీసులు ఇవి. ఈ వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
కోల్లెజ్.. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా, మేము దానిని జూలై 29, 2019 నుండి వచ్చిన వార్తా నివేదికలో కనుగొన్నాము. మంగళూరులోని బజ్పే పోలీసులు దుప్పటి అమ్మేవారిగా పేరు తెచ్చుకున్న ‘ఇరానీ గ్యాంగ్’ గురించి ప్రజలను హెచ్చరించారు. ఈ ముఠా చిక్కమగళూరు పట్టణంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు.
వైరల్ కోల్లెజ్‌ని నిశితంగా పరిశీలించగా.. మంగళూరు పోలీసులు నివేదికలలో పేర్కొన్నది కూడా 26 మంది వ్యక్తులేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యక్తులు ఇరాన్‌కు చెందిన వారని కూడా నివేదికలు పేర్కొనలేదు.
వార్తా కథనాల ప్రకారం.. ఈ ముఠా సభ్యులు పగటిపూట దుప్పట్లు అమ్మే వారి లాగా నటిస్తూ ఇళ్లను సర్వే చేసి, తరువాత తిరిగి దోచుకునేవారు.
జూలై 30, 2019న విజయ కర్ణాటక ప్రచురించిన ఒక నివేదికను కూడా మేము చూశాము. ఈ ప్రాంతంలో ఇరానీ గ్యాంగ్‌లకు సంబంధించిన ఎటువంటి సంఘటనలు జరగలేదని ఉడిపి ఎస్పీ స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఇంటి దగ్గర ఎవరైనా అనుమానాస్పద అపరిచిత వ్యక్తులు లేదా అమ్మకందారులు కనిపిస్తే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ ప్రజలను కోరారు.
2019లో ఇదే ఫోటో తెలంగాణలో కూడా వైరల్‌గా మారింది.అయితే అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు.
అందువల్ల, ‘ఇరానియన్ ముఠా’కు సంబంధించిన వైరల్ నోటీసును మంగళూరు పోలీసులు 2019లో జారీ చేశారని తేలింది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.