Fact Check: నీటిలో మునిగి మరణించిన వ్యక్తిని ఉప్పుతో కప్పి తిరిగి ప్రాణం తెప్పించలేము
No, Drowned People Cannot Be Revived By Covering The Body With Salt. “చాలా ముఖ్యమైన సమాచారం, ఎవరైనా నీటిలో మునిగి చనిపోతే 3-4 గంటల్లో మృతదేహం దొరికితే,
By Nellutla Kavitha Published on 10 Feb 2023 6:18 AM GMT“చాలా ముఖ్యమైన సమాచారం, ఎవరైనా నీటిలో మునిగి చనిపోతే 3-4 గంటల్లో మృతదేహం దొరికితే, ప్రాణాలు తిరిగి తెచ్చుకోవచ్చు." అనే సందేశంతో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. వైరల్ అవుతున్న పోస్ట్ గురించి ఇక్కడ క్లిక్ చేయండి.
మరొక నెటిజన్ ఫేస్ బుక్ లో ఇదే మెసేజ్ పోస్ట్ చేశారు.
వైరల్ అయిన ఇదే సందేశాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు. వైరల్ పోస్టుల కోసం ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
నిజంగానే నీటిలో మునిగి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఉప్పుతో కప్పి ఉంచడం వల్ల తిరిగి బ్రతికించవచ్చా?! వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ పోస్టులో నిజం ఎంత?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం ముందుగా వైరల్ సందేశంలో ఉన్న రెండు ఫోన్ నెంబర్లకు కాల్ చేసింది న్యూస్ మీటర్. ముందుగా +919454311111 ఈ నెంబర్ కు కాల్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పదేపదే కాల్ చేసినప్పుడు కూడా అదే సందేశం వచ్చింది. ఇక ఈ పోస్టులో ఉన్న రెండవ నెంబర్ +919335673001 కు కాల్ చేసినప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అని మెసేజ్ వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా అదే రిపీట్ అయింది. దీంతో గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గతంలో మహారాష్ట్ర లోని జల్గావ్ లో ఇలాంటి సందేశాన్ని నమ్మే ఒక కుటుంబం నీటిలో మునిగి చనిపోయిన ఇద్దరు కుటుంబ సభ్యులను, ఉప్పుతో కప్పి ఉంచారని, అయితే ఎన్ని గంటలైనా తిరిగి రాకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారని ఈటీవీ వార్త ప్రసారం చేసింది. మృతుల బంధువులే మృతదేహాల మీద ఉప్పు కప్పి ఉంచాలని, మూఢ నమ్మకంతో డాక్టర్లను కోరారని, చివరికి మరణించిన కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలిందనేది వార్త. Aug 19, 2019 రోజున ప్రసారమైన వార్తను ఇక్కడ చూడవచ్చు.
ఇక గతేడాది సెప్టెంబర్ లో కూడా ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి లో జరిగింది. నీటిలో మునిగి చనిపోయిన తమ పదేళ్ల కుమారుడు తిరిగి వస్తాడని భావించి, వంద కిలోల ఉప్పుతో మొఖం తప్ప మిగతా శరీర భాగం అంతా కప్పి ఉంచామని, అయితే నాలుగు గంటలు గడిచిన బాబు బతికి రాకపోవడంతో చివరికి అంత్యక్రియలు చేశామని తల్లితండ్రులు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ గా ఫార్వర్డ్ అయిన మెసేజ్ ను చూసి తమ బాబు తిరిగి వస్తాడని నమ్మామని, అయితే అలా జరగలేదని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
ఇక మధ్యప్రదేశ్లో ఆగస్టు 2018 లో జరిగిన మరొక సంఘటనను ఇక్కడ చూడవచ్చు. నీటిలో మునిగి చనిపోయిన తమ కుమారుడి పోస్ట్ మార్టం కోసం పోలీసులు హాస్పిటల్ కు తీసుకు వచ్చినప్పటికి కూడా, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వచ్చిన ఈ మెసేజ్ ఆధారంగా ఉప్పులో కప్పి ఉంచినప్పటికీ, ఎలాంటి లాభం లేదనే వార్త ఇక్కడ చూడవచ్చు. వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లేబరేటరీ కోస్టల్ రీసెర్చ్’ కి చెందిన రీసెర్చ్ ప్రొఫెసర్ Dr John R. Fletemeyer - ఎవరైనా వ్యక్తి నీటిలో మునిగిపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో “ఆక్వాటిక్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్”లో వివరించారు. నీటిలో మునిగిపోయిన వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకుంటారని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల అతి ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుందని డాక్టర్ జాన్ ఇందులో వివరించారు. శ్వాస తీసుకోవడం ఆగిపోవడం వల్ల కొద్దిసేపు గుండె కొట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత శ్వాసతో పాటుగా గుండె కూడా ఆగిపోతుందని, దీంతో ఆ వ్యక్తి మరణిస్తారని ఆయన వివరించారు.
అనుకోకుండా జరిగే గాయాల బారిన పడి మరణించే జాబితాలో మూడవ స్థానంలో నీటిలో మునిగి మరణించడం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 2,36,000 మరణాలు నీటిలో పడడం వల్లే సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇందులో ఎక్కడా మరణించిన వ్యక్తి మీద ఉప్పును కప్పి ఉంచడం వల్ల తిరిగి వస్తారంటూ వివరించలేదు.
సో, నీటిలో మునిగి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఉప్పుతో కప్పి ఉంచడం వల్ల తిరిగి బతికించవచ్చు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న పోస్టులో నిజం లేదు.నీటిలో మునిగి మరణించిన వ్యక్తిని ఉప్పుతో కప్పి తిరిగి ప్రాణం తెప్పించలేము