భారతదేశంలో సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. 12-04-2021న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 1,68,912 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో‌ 75,086 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 904 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,70,179కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. 12,01,009 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కరోనా వ్యాప్తి కొనసాగుతూ ఉండగా.. సామాజిక మాధ్యమాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సంబంధించిన విషయాలంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. అరటిపండు తింటే కరోనా మహమ్మారిని అంతం చేయొచ్చు అంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. అరటి పళ్ళు తినడం వలన అందులో ఉన్న ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆస్ట్రేలియా లోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ లో చేసిన పరిశోధనల ద్వారా రోజూ అరటిపండు తినడం వలన విటమిన్ బి-6 శరీరంలో చేరి అది కరోనా వైరస్ ను అరికడుతుంది చెప్పుకొచ్చారు. ఆ వీడియో పైన ప్రతి రోజూ అరటి పండు తింటే కరోనా దగ్గరకు కూడా రాదని అన్నారు.


పలువురు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

వైరల్ అవుతున్న వీడియో లోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న వీడియోను రెండు వీడియోల నుండి తీసుకుని ఎడిటింగ్ చేసిందిగా స్పష్టంగా తెలుస్తోంది.


ABC News Australia, Wall Street Journal కు సంబంధించిన వీడియోలను తీసుకుని.. అరటి పళ్ళు రోజూ తింటే కరోనాకు చెక్ పెట్టొచ్చు అనే వీడియోను తయారు చేశారు.

APnews.com, Rappler సంస్థలు ఈ వీడియోపై ఫ్యాక్ట్ చెక్ కూడా చేశాయి. క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ఈ వైరల్ వీడియోను తప్పుబట్టింది. ఇలాంటి తప్పుడు వార్తలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదని తెలిపింది.

అరటి పళ్ళలో మంచి పోషకాలు, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం వంటివి ఉంటాయని.. అయితే వాటిని తింటే కరోనాను కట్టడి చేయొచ్చు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఇంతకు ముందు ఏడాది వెల్లుల్లి తింటే కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయొచ్చు అంటూ కథనాలు వైరల్ అవ్వగా.. న్యూస్ మీటర్ వాటిని ఖండించింది.

అరటిపళ్ళు ప్రతి రోజూ తింటే కరోనా వైరస్ ను కట్టడి చేయొచ్చు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


సామ్రాట్

Next Story