ఫ్యాక్ట్ చెక్: ఐకానిక్ ఫోటోను ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీకి సీతారాం ఏచూరి క్షమాపణలు చెబుతున్నట్లుగా తప్పుగా షేర్ చేశారు.

ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ పౌర హక్కులను కాలరాశారని ఆరోపిస్తూ సీతారాం ఏచూరి ‘ఛార్జిషీట్’ చదువుతున్న చిత్రం.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2024 2:49 PM GMT
ఫ్యాక్ట్ చెక్: ఐకానిక్ ఫోటోను ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీకి సీతారాం ఏచూరి క్షమాపణలు చెబుతున్నట్లుగా తప్పుగా షేర్ చేశారు.

Claim : ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి క్షమాపణలు చెప్పాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బలవంతం చేశారని తెలుస్తోంది.

Fact: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ పౌర హక్కులను కాలరాశారని ఆరోపిస్తూ సీతారాం ఏచూరి ‘ఛార్జిషీట్’ చదువుతున్న చిత్రం.

హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి గురువారం కన్నుమూశారు. అనేక దశాబ్దాలుగా ఆయన చేసిన రాజకీయాలు, చేసిన పోరాటాలు, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఆయన చూపించిన తెగువను చాలా మంది గుర్తు చేసుకున్నారు.

ఇంతలో ఒక X వినియోగదారు సీతారాం ఏచూరి చిత్రంతో “కాంగ్రెస్ వారు JNUలో ఏమి చేశారో ఒప్పుకోవాలి.” అంటూ పోస్టు పెట్టారు.

ఆ చిత్రంలో, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చూస్తుండగా ఏచూరి అందరి ముందు నిలబడి పేపర్ ను చూసి చదువుతున్నట్లు కనిపించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఇందిరాగాంధీ సమక్షంలో ఏచూరి క్షమాపణలు చెబుతున్నట్లు ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్న వ్యక్తులు వాదిస్తూ ఉన్నారు.

చిత్రంపై ఉన్న టెక్స్ట్ ప్రకారం “1975, ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ఢిల్లీ పోలీసులతో JNUలోకి ప్రవేశించి, CPI నాయకుడు, ఆ సమయంలో JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం ఏచూరిని కొట్టి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు రాజీనామా చేయించడమే కాకుండా, క్షమాపణ లేఖను చదవమని బలవంతం చేశారు. (sic)” అని అందులో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ లో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ పౌర హక్కులను కాలరాశారని ఏచూరి తన వాయిస్ వినిపించారని ఈ చిత్రం చూపుతోంది.

జూన్ 25, 1975న, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్త ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ మార్చి 21, 1977 వరకు 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. పౌర హక్కులు అణచివేశారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టారు.

ఇక జనవరి 1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ భారీ విజయం సాధించి. భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1978లో ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్‌గా కొనసాగారు. సీతారాం ఏచూరి నేతృత్వంలోని జెఎన్‌యు విద్యార్థులు ప్రతిస్పందిస్తూ, ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కులను సస్పెండ్ చేసినందుకు ఛాన్సలర్‌గా ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమెపై ‘ఛార్జిషీట్’ ను సమర్పించారు.

వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా..టైమ్స్ ఆఫ్ ఇండియాలో ‘From Rebel To Icon: How Sitaram Yechury’s Defiance Made Indira Gandhi Resign As JNU Chancellor,' అనే శీర్షికతో సెప్టెంబరు 12, 2024న ప్రచురించిన ఒక నివేదిక కనిపించింది. అందులో సీతారాం ఏచూరి, ఇందిరా గాంధీ ఉన్నారు.

నివేదిక ప్రకారం.. సీతారాం ఏచూరి ఇందిరా గాంధీ సమక్షంలోనే ఆమెకు వ్యతిరేకంగా ‘ఛార్జిషీట్’ చదువుతున్న చిత్రం అది. చివరికి, ఈ నిరసనల కారణంగా JNU ఛాన్సలర్ పదవికి ఇందిరా గాంధీ రాజీనామా చేశారు. 1978లో జరిగిన నిరసనలో భాగంగా ఈ ఫోటోను తీశారని నివేదిక సూచించింది.

ఇంకా, మేము సంబంధిత కీలక పదాలను ఉపయోగించి సెర్చ్ చేసాము. డెక్కన్ హెరాల్డ్‌లో ‘Indira Gandhi’s Emergency to right-wing communal forces: Comrade Sitaram Yechury was a fighter to remember’ అనే శీర్షికతో సెప్టెంబరు 12, 2024 నాటి ఒక నివేదికను కనుగొన్నాము. అందులో కూడా సీతారాం ఏచూరీ ఇందిరా గాంధీ పై ‘ఛార్జిషీట్’ చదువుతున్నారని తెలుస్తోంది. నివేదికలో సీతారాం ఏచూరికి సంబంధించిన అదే చిత్రం ఉంది, “1978లో ఏచూరి నేతృత్వంలోని నిరసన తర్వాత ఇందిరా గాంధీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా రాజీనామా చేశారు - ఇందిరా తనపై ఏచూరి ఛార్జిషీట్‌ను చదివినప్పుడు వింటున్న ఒక ఐకానిక్ ఫోటో" అని తెలిపారు.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. బిజినెస్ టుడేలో ప్రచురించబడిన కథనాన్ని గుర్తించాం. "Sitaram Yechury: The tallest Left leader who once read a ‘chargesheet to Indira Gandhi" అనే శీర్షికతో సెప్టెంబరు 12, 2024న అర్నవ్ దాస్ శర్మ కథనాన్ని రాశారు.

మేము 'ది వైర్‌'లో ఇలాంటి వివరణతో కూడిన ఫోటోను కనుగొన్నాము.

ఏచూరిని స్మరించుకుంటూ ఎథిరన్ కతిరవన్ రాసిన ‘Emergency Day’ శీర్షికతో సెప్టెంబర్ 13, 2024న మలయాళ వార్తాపత్రిక మాతృభూమిలో ప్రచురించబడిన కథనాన్ని మేము కనుగొన్నాము. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ జేఎన్‌యూలోని విద్యార్థులను ఎలా ప్రభావితం చేసిందో రచయిత వివరించారు.

రచయిత ఫోటో తీసిన సందర్భాన్ని కూడా అందించారు. 1978లో, విద్యార్థుల బృందం ఇందిరా గాంధీ నివాసానికి మార్చ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిరసనలో ఏచూరి నాయకత్వ పాత్ర పోషించారు. ఇందిరా గాంధీపై ఉన్న ఛార్జిషీటును చదివి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రశాంతంగా స్పందించిన ఆమె మరుసటి రోజే జేఎన్ యూ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు.

మాతృభూమి కాలమ్‌లో, ఫోటోగ్రాఫ్‌పై ప్రచారంలో ఉన్న తప్పుడు వాదనలను రచయిత చర్చించారు. తప్పుడు సమాచారాన్ని ఖండించారు. తాను, యేచూరి JNUలో కలిసి ఉన్నామని, ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన అనుభవాలను వివరించామని రచయిత తెలిపారు.

ఎథిరన్ కతిరవన్ NewsMeterతో స్పందిస్తూ, "నేను మార్చ్‌లో పాల్గొనలేదు, కానీ నేను క్యాంపస్‌లో ఉన్నాను. నాకు ఏమి జరిగిందో స్పష్టంగా గుర్తుంది. మరుసటి రోజు క్యాంపస్‌లో వేడుకలు జరిగాయి. ఏచూరి క్షమాపణలు చెబుతున్నారనే ఈ ఆరోపణ చాలా కొత్తది. ఇందిరాగాంధీ ఛాన్సలర్‌ పదవికి రాజీనామా చేశారన్న వాస్తవాన్ని చరిత్రపై అవగాహన లేని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ఫోటో తీసిన ప్రదేశానికి సంబంధించి, జిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏచూరి వివరించారు. ఇతర విద్యార్థులతో కలిసి ఇందిరా గాంధీ నివాసానికి వెళ్లి ఆమె సమక్షంలో ‘ఛార్జిషీట్’ ఎలా చదివారో వివరించారు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:ఫ్యాక్ట్ చెక్: ఐకానిక్ ఫోటోను ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీకి సీతారాం ఏచూరి క్షమాపణలు చెబుతున్నట్లుగా తప్పుగా షేర్ చేశారు.
Claimed By:Social media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Next Story