భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో ప్రభుత్వం ఛలానాలను వసూలు చేయాలని సంకల్పించింది. దీంతో మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి దగ్గర నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫైన్ లను వసూలు చేస్తూ ఉన్నాయి.
పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులను తప్పకుండా వాడాలని తెలంగాణ ప్రభుత్వం కూడా తెలిపింది. లేదంటే భారీగా ఫైన్ కట్టాల్సిందేనని తెలిపింది. తాజాగా ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే మాస్క్ లేకుండా తిరుగుతూ ఉన్న వారికి 2000 రూపాయలు ఫైన్ వేశారు.
deccan.news లో కూడా ఓ కథనం వచ్చింది. అందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టీమ్ ఫతే నగర్ లోని ధనలక్ష్మి స్టీల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. సిబ్బంది ఒక్కరు కూడా మాస్కులు లేకుండా ఉన్నారని.. దీంతో 2000 రూపాయలు ఛలానా వేశారని తెలిపారు.
నిజ నిర్ధారణ:
జీహెచ్ఎంసీ పరిధిలో మాస్క్ వేసుకోని వారికి 2000 రూపాయలు ఫైన్ వేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
"GHMC challan for not wearing mask" అనే కీవర్డ్స్ ను ఉపయోగించి న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా ఈ వైరల్ ఫోటో మే 2020కి చెందినదని తెలుస్తోంది.
మే 2020లోనే పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ ఛలానాలో తేదీని కూడా గమనించవచ్చు.. 27-05-2020 అని ఉంది. ఛలానా నెంబర్ కూడా 1353 అని ఉంది. అప్పటి ఫోటోను ఇప్పటిదిగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు.
ఒరిజినల్ ఛలానాను హైదరాబాద్ లోని ధనలక్ష్మి స్టీల్స్ కంపెనీకి వేశారు. అది కూడా గత ఏడాది మే 27న అని స్పష్టంగా తెలుస్తోంది.
ఒరిజినల్ ఛలానాకు, వైరల్ అవుతున్న ఛలానాకు మధ్య ఉన్న తేడాలను గమనించవచ్చు.
న్యూస్ మీటర్ జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించగా ఇది పాత రిసిప్ట్ అని అధికారులు తేల్చేశారు.
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో మాస్క్ వేసుకోని వారికి 2000 రూపాయలు ఫైన్ వేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఫోటో గత ఏడాదికి చెందినది.