నిజమెంత: కేరళలో ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన పాత వీడియోలను ఇటీవలివిగా చెబుతూ వైరల్ చేస్తున్నారు
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 277 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా చెబుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Aug 2024 5:45 PM ISTనిజమెంత: కేరళలో ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన పాత వీడియోలను ఇటీవలివిగా చెబుతూ వైరల్ చేస్తున్నారు
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 277 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా చెబుతోంది. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు 240 మంది వరకు ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.
భారీ నీటి ప్రవాహం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఈ వీడియో వాయనాడ్ నుండి వచ్చినట్లు చెబుతూ.. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.
“Terrific footage in #wayanad, Kerala. #WayanadLandslide #WayanadDisaster” అంటూ పోస్టులు పెడుతున్నారు. వాయనాడ్ లో జరిగిన విధ్వంసం అంటూ షేర్ చేస్తున్నారు.
పలు సోషల్ మీడియా సైట్లలో ఈ వీడియోను ఇటీవలే జరిగిందిగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ వీడియో ఒక నెల కంటే పాతది. కేరళలోని వాయనాడ్ కు సంబంధించినడి కాదు.
వైరల్ వీడియోను నిశితంగా గమనిస్తే.. జూన్ 16, 2024 అనే తేదీ కనిపిస్తుంది. అది కూడా CCTV రికార్డింగ్. ఇది వాయనాడ్‌లో ఇటీవలి ప్రమాదంతో సరిపోలలేదు. నివేదికల ప్రకారం.. జూలై 30న కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జూన్ 24, 2024న ది ఎపోచ్ టైమ్స్ Xలో పోస్ట్ చేసిన అదే క్లిప్‌కు దారితీసింది. ఈ పోస్ట్ ప్రకారం.. వీడియో చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని పింగ్యువాన్ కౌంటీలోని ఒక గ్రామంలోనిది.
క్యాప్షన్ లో.. “జూన్ 16, 2024న, మీజౌ నగరంలోని పింగ్యువాన్ కౌంటీలోని హువాంగ్టియన్ విలేజ్‌లోని హువాంగ్టియన్ రిజర్వాయర్ అకస్మాత్తుగా వరద నీటిని విడుదల చేసింది. మూడు గంటల్లో నీటి మట్టం రెండు మీటర్ల మేర పెరిగింది. పింగ్యువాన్ కౌంటీలోని జాంగ్యాన్ గ్రామంలో వరదలు ముంచెత్తడాన్ని నిఘా కెమెరాలు బంధించాయి. జూన్ 21న 15:00 నాటికి, మెయిజౌ సిటీలోని పింగ్యువాన్ కౌంటీలో భారీ వర్షాల కారణంగా మొత్తం 38 మంది మరణించారని.. 2 మంది తప్పిపోయారని అధికారులు తెలిపారు.
2024年6月16日,梅州市平远县黄田村黄田水库突然泄洪,监控拍下平远县樟演村一处院子被淹没的过程,显示当地水位在3小时内爆长两米。当局宣布,截至6月21日15时,梅州市平远县强降雨灾害共造成38人死亡、2人失联。#大纪元爆料 #洪水 #泄洪 #梅州 pic.twitter.com/vZjHUOgFUm
— 大紀元爆料平台 (@china_epoch) June 24, 2024
మేము జూన్ 26 నుండి మీడియాసెట్ ఇన్ఫినిటీ పోస్టు చేసిన ఇదే వీడియోను గుర్తించాం. చైనాలో ఈ ఘటన చోటు చేసుకుందని.. టైమ్‌లాప్స్ వీడియో అని నివేదించారు.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. జూన్ 21న NBC న్యూస్ కథనం చూశాం. "దక్షిణ చైనాలో ఊహించని విధంగా ముంచుకొచ్చిన వరదల్లో 47 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు" అనే పోస్ట్‌ను కూడా కనుగొన్నాం.
ఈ నివేదికలో.. అదే వీడియో లేనప్పటికీ, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 47 మంది మరణించారని ధృవీకరించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వాయనాడ్ లో ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన వీడియో అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో చైనాలోని తూర్పు గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ సిటీకి చెందినది.
Credit: Sibahathulla Sakib