నిజమెంత: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో పర్యటించిందా?
హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో విహారయాత్రకు వచ్చిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2024 10:24 AM IST
నిజమెంత: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో పర్యటించిందా?
హాలీవుడ్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ భారతదేశంలో విహారయాత్రకు వచ్చిందంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారతదేశానికి చెందిన ఆమె అభిమానులు స్కార్లెట్ జాన్సన్ భారతదేశ పర్యటనకు వచ్చేసిందంటూ ఈ చిత్రాన్ని పంచుకుంటున్నారు.
ఇలాంటి క్లెయిమ్‌లు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మరిన్ని వీక్షించడానికి ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్ చేయండి.
Scarlett Johansson is in Delhi ? 😭♥️ pic.twitter.com/62N05YGvH8
— Shubham2.0 (@bhav_paaji) April 3, 2024
వైరల్ ఇమేజ్‌లో.. స్కార్లెట్ జాన్సన్ నీలిరంగు దుస్తులలో కనిపించారు. రోడ్డు పక్కన ఎరుపు రంగు రిక్షా లోపల పోజులిచ్చినట్లు మనం చూడొచ్చు. 'ది బ్లాక్ విడో' ఢిల్లీకి వచ్చిందా అని వినియోగదారులు ఆశ్చర్యపోతున్న సమయంలో ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలు సోషల్ మీడియా సైట్స్ లో ఈ ఫోటో వైరల్ అవుతూ వచ్చింది.
నిజ నిర్ధారణ:
వైరల్ చిత్రం డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో కావడంతో.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.
మేము సంబంధిత మీడియా నివేదికల కోసం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. అయితే ఎవెంజర్స్ స్టార్ స్కార్లెట్ జాన్సన్ భారతదేశాన్ని సందర్శించారంటూ ఎలాంటి వార్తా కథనాన్ని కూడా మేము కనుగొనలేకపోయాము. స్కార్లెట్ జాన్సన్ భారతదేశ పర్యటనకు వచ్చి ఉండి ఉంటే తప్పకుండా దేశ మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
తర్వాత.. మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించాం. మేము @nilgulyoruk అనే వినియోగదారు పేరుతో ఉన్న Instagram హ్యాండిల్‌లో ఇలాంటి చిత్రాన్ని కనుగొన్నాము. ముఖం తప్ప మొత్తం చిత్రం అలాగే ఉంది. ఈ ప్రొఫైల్ జర్మన్ ట్రావెల్ బ్లాగర్, సోలో ట్రావెలర్ నీల్గుల్యోరుక్ (Nilgulyoruk)కి చెందినది.
ఆమె ప్రొఫైల్‌ను పరిశీలిస్తే, ఇన్‌స్టాగ్రామర్ అక్టోబర్ 10, 2023న భారతదేశాన్ని సందర్శించినట్లు మేము కనుగొన్నాము. వైరల్ చిత్రాన్ని... ఒరిజినల్ చిత్రాన్ని మేము పోల్చి చూశాం. నీల్గుల్యోరుక్ ఒరిజినల్ ఫోటోలో ఉన్న మహిళ అని మేము గుర్తించాం. ఆమె ముఖాన్ని మార్చేసి.. స్కార్లెట్ ముఖాన్ని ఎడిట్ చేశారు. ఇక్కడ మీరు ఒరిజినల్ కు ఫేక్ కు మధ్య ఉన్న తేడాలను గమనించవచ్చు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె పోస్ట్ చేసిన చిత్రాల నుండి రిక్షాలో ఆమె ఉన్న ఫోటోను తీసుకున్నారు. ఇతర ఫోటోలలో ఆమె ఎర్రకోట, జామా మసీదు, చాందినీ చౌక్, అక్షరధామ్ టెంపుల్, ఢిల్లీ గేట్‌లను సందర్శించినట్లు చూపుతున్నాయి.
రిహానా, దువా లిపాతో సహా పలువురు హాలీవుడ్ తారలు ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు. ఇక స్కార్లెట్ జాన్సన్ ఇటీవలి కాలంలో భారత్ పర్యటనకు రాలేదని తెలుస్తోంది. అందువల్ల, స్కార్లెట్ భారతదేశాన్ని సందర్శించారనే వార్తలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము. వైరల్ చిత్రాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
Credits: Sunanda Naik