నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జట్టు 4x400m రిలే ఫైనల్స్‌కు అర్హత సాధించిందా?
ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు.
By అంజి Published on 29 July 2024 6:00 PM ISTనిజమెంత: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జట్టు 4x400m రిలే ఫైనల్స్‌కు అర్హత సాధించిందా?
ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకం గెలుచుకుంది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. మను 221.7 పాయింట్లు గెలుచుకోగా తొలి రెండు స్థానాల్లో దక్షిణ కొరియా ప్లేయర్లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఒయె జిన్ 243.2 పాయింట్లతో బంగారం, కిమ్ యెజి 241.3 పాయింట్లతో వెండి పతకాలు సాధించారు.
ఈ నేపథ్యంలో రిలే రేస్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నాలుగు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో భారత్ రన్నరప్‌గా నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించినట్టు చూపుతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఫైనల్స్‌కు అర్హత సాధించిందని సూచిస్తూ పలువురు X వినియోగదారులు వీడియోను షేర్ చేశారు.
మాజీ ఐపీఎస్ అధికారి, పుదుచ్చేరి మాజీ ఎల్జీ కిరణ్ బేడీ “India makes it to finals. Have a look. #OlympicGames.” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. (ఆర్కైవ్)
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. “India in the finals! Jai Hind!.. #OlympicGames.” (ఆర్కైవ్) అంటూ పోస్టు పెట్టారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. 2023లో నిర్వహించిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు భారత రిలే జట్టు అర్హత సాధించిన వీడియో ఇది.
మేము వైరల్ క్లిప్‌లోని కామెంటరీని విన్నాము. USAతో పాటు భారతదేశం ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిందని అందులో చెప్పడాన్ని మేము కనుగొన్నాము.
దీన్ని క్లూగా తీసుకొని.. మేము ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. YouTube ఛానెల్ బ్రౌన్ బాలర్స్‌లో 27 ఆగస్టు 2023న అదే విజువల్స్‌ని చూపించే వీడియోను మేము కనుగొన్నాము. వీడియోలో భారత జట్టు 4x400m పురుషుల రిలే జట్టు మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించినట్లు తెలిపింది.
TMC రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ'బ్రియన్ ఆగస్టు 27న వీడియోను షేర్ చేస్తూ.. భారతీయ క్రీడలకు ఇది చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. తన క్యాప్షన్‌లో, భారత రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడానికి నాయకత్వం వహించిన ఆటగాళ్లు యాహియా, జాకబ్, అజ్మల్, రాజేష్‌ల అత్యుత్తమ ప్రదర్శనను కొనియాడారు.
ఆగస్టు 27న ది హిందూ, న్యూస్ 18 నివేదికల ప్రకారం, ముహమ్మద్ అనాస్ యాహియా, అమోజ్ జాకబ్, ముహమ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్‌లతో కూడిన భారత పురుషుల 4x400 రిలే జట్టు 2 నిమిషాల 59.05 సెకన్లలో ఆసియా రికార్డును బద్దలు కొట్టింది. ఈ అద్భుతమైన ప్రదర్శన ఆగస్టు 26, 2023న బుడాపెస్ట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చేశారు. వారు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించినా.. ఫైనల్స్‌లో భారత్ 2:59:92 సెకన్లకు ఐదో స్థానంలో నిలిచింది.
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో పురుషుల 4x400 మీటర్ల రిలే రేసు ఎప్పుడు జరుగుతుంది?
అధికారిక ఒలింపిక్స్ వెబ్‌సైట్ ప్రకారం.. పురుషుల 4x400m రిలే రేసు మొదటి రౌండ్ శుక్రవారం, ఆగస్టు 9న, ఫైనల్ ఆగస్ట్ 10, శనివారం షెడ్యూల్ చేశారు. రెండు ఈవెంట్‌లు స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరుగుతాయి.
అందువల్ల, వైరల్ క్లిప్ పాతదని మేము నిర్ధారించాము. ఆగస్టు 26, 2023న బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ వీడియోను భారతదేశం ఒలింపిక్స్ లో ఫైనల్‌కు అర్హత సాధించినట్లుగా ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Md Mahfooz Alam