నిజమెంత: లెబనాన్ లో టాయ్ లెట్ కమోడ్ లు కూడా పేలిపోతూ ఉన్నాయా

సెప్టెంబరు 17-18 తేదీలలో లెబనాన్‌లో పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్ల కారణంగా 30 మందికి పైగా మరణించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2024 8:00 AM GMT
Fakenews, Israel, Hezbollah, pager attack

నిజమెంత: లెబనాన్ లో టాయ్ లెట్ కమోడ్ లు కూడా పేలిపోతూ ఉన్నాయా  

సెప్టెంబరు 17-18 తేదీలలో లెబనాన్‌లో పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్ల కారణంగా 30 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు, హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్‌ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో, ఒక X వినియోగదారు పబ్లిక్ టాయిలెట్ లోపల పేలిన కమోడ్ చిత్రాన్ని పోస్ట్ చేసారు. లెబనాన్ పేలుళ్లకు సంబంధించిన ఘటన అంటూ ట్వీట్ లో ఆరోపించారు.

ఒక X వినియోగదారు చిత్రాన్ని షేర్ చేసి, “లెబనాన్‌లోని బీరుట్‌లో కమోడ్‌లు కూడా పేలుతున్నాయి. హిజ్బుల్లా ఉగ్రవాదులు సైతం టాయిలెట్‌కి వెళ్లాలంటే భయపడుతున్నారు. తర్వాత ఏమి పేలుతుంది?" అంటూ పోస్టు పెట్టారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

న్యూస్‌మీటర్ క్లెయిమ్ లో ఎలాంటి నిజం లేదని కనుగొంది. పేలిన టాయిలెట్ చిత్రం 2020లో హాంకాంగ్‌లోనిది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో ‘Unexploded IED found at Shenzhen border control point, after suspected bomb destroys second Hong Kong toilet in 24 hours.’ అనే శీర్షికతో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన నివేదికకు దారితీసింది

షెన్‌జెన్ సరిహద్దు నియంత్రణ పాయింట్‌లో IED పేలుడు పదార్థాలను కనుగొన్నారని, మరో ఘటనలో హాంకాంగ్ లో పేలుడు కారణంగా టాయిలెట్‌ ధ్వంసం అయిందన్నది అందులో తెలిపారు.

ఈ వార్తా నివేదిక ద్వారా వైరల్ చిత్రం పాతదని స్పష్టంగా తెలుస్తోంది.

అదే SCMP కథనాన్ని ప్రచురించిన వెబ్‌సైట్ inklలో కూడా ఈ చిత్రం కనుగొన్నారు. "జనవరి 27న వెస్ట్ కౌలూన్‌లోని జోర్డాన్ రోడ్‌లోని కింగ్ జార్జ్ V మెమోరియల్ పార్క్‌లో అనుమానాస్పద పేలుడు వస్తువు పబ్లిక్ టాయిలెట్‌ను ధ్వంసం చేసింది." అంటూ కథనంలో పేర్కొన్నారు.

కథనం ప్రకారం, అనుమానాస్పద బాంబు కారణంగా టాయిలెట్‌ లో పేలుడు సంభవించింది. అదే సమయంలో షెన్‌జెన్ బే కంట్రోల్ పాయింట్‌లోని చెత్త డబ్బాలో IED కనుగొన్నారు.

నివేదిక ప్రకారం, ఒక చిన్న పరికరం, నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాన్ని అందులో ఉంచారు. మంగళవారం ఉదయం 10:25 గంటలకు సరిహద్దు స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డు దీన్ని కనుగొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

సంబంధిత కీలకపదాలను ఉపయోగించి సెర్చ్ చేయగా.. జనవరి 28, 2020 నాటి ‘Bomb threat at public toilet at Shenzhen Bay Port’ శీర్షికతో చైనా డైలీ ప్రచురించిన నివేదికను కూడా మేము కనుగొన్నాము. కింగ్ జార్జ్ V మెమోరియల్ పార్క్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో పేలుడు జరిగినట్లు నివేదిక పేర్కొంది.

అందువల్ల, ఈ చిత్రం లెబనాన్‌లో ఇటీవల పేలుళ్లను చూపుతుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం 2020లో హాంకాంగ్‌లోని పబ్లిక్ టాయిలెట్‌ కు సంబంధించింది.

Credit: Sibahathulla Sakib

Next Story