నిజమెంత: మయన్మార్‌లో చనిపోయిన రోహింగ్యాల విజువల్స్ ను బంగ్లాదేశ్ లో అశాంతికి ముడిపెట్టారా?

హిందువుల ఇళ్లలోకి దూరి దాడి చేసి బాలికలను చంపేస్తున్నారనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2024 8:15 PM IST
NewsMeterFactCheck, Rohingyas, Myanmar, Bangladesh

నిజమెంత: మయన్మార్‌లో చనిపోయిన రోహింగ్యాల విజువల్స్ ను బంగ్లాదేశ్ లో అశాంతికి ముడిపెట్టారా? 

ప్రభుత్వ ఉద్యోగ కోటా సంస్కరణలపై విస్తృత అశాంతి మధ్య బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన నాలుగు రోజుల తర్వాత.. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్.. మరో 13 మంది సలహాదారులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి నడిపిస్తూ ఉన్నారు. ముహమ్మద్ యూనస్ ఆగస్టు 8న ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో భాగంగా.. బంగ్లాదేశ్‌లోని హిందువులు, అన్ని మైనారిటీ సమూహాల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు.

అయితే హిందువులపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఆందోళనలను పెంచుతోంది. ఒక ఇంట్లో చనిపోయిన పిల్లలను చూపించే ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. హిందువుల ఇళ్లలోకి దూరి దాడి చేసి బాలికలను చంపేస్తున్నారనే వాదనతో వీడియో వైరల్ అవుతూ ఉంది.

“#SaveBangladeshiHindus.” అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఈ వీడియో మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతానికి చెందినది. కాబట్టి ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. జూన్ 2024లో రోహింగ్యా మానవ హక్కుల కార్యకర్త మాంగ్ హ్లా మైయింట్ లింక్డ్‌ఇన్‌లో వీడియో పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. హబీ వెస్ట్ రోహింగ్యా గ్రామం, రఖైన్ రాష్ట్రంలోని మౌంగ్‌డా టౌన్‌షిప్‌లో పెద్ద ఎత్తున పేలుడు సంభవించిన తర్వాత ఈ సంఘటన జరిగిందని పోస్ట్ సూచించింది. (ఆర్కైవ్)

జూన్ 9న రోహింగ్యా కార్యకర్త, జర్నలిస్ట్ నేయ్ శాన్ ల్విన్ పోస్ట్ చేసిన వైరల్ వీడియో నుండి మేము ఈ రకమైన చిత్రాన్ని కనుగొన్నాము. ఫ్రీ రోహింగ్యా కోయలిషన్ సహ-వ్యవస్థాపకుడు ఎల్విన్.. రోహింగ్యా ప్రజల కోసం పని చేస్తున్న ప్రముఖ న్యాయవాది. హింస కారణంగా ఎంతో మంది రోహింగ్యాలు బలవుతూ ఉన్నారని.. వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. (ఆర్కైవ్)

రఖైన్ రాష్ట్రంలోని మౌంగ్‌డా టౌన్‌షిప్‌లో మయన్మార్ మిలిటరీ, అరకాన్ ఆర్మీ (AA) మధ్య జరిగిన ఘర్షణల సమయంలో, హబీ వెస్ట్ రోహింగ్యా కుగ్రామంపై దాడి జరగడంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు మరణించారని పోస్ట్‌లో ల్విన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలు అవ్వగా.. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని వివరించారు.

న్యూస్‌మీటర్ ల్విన్‌ను సంప్రదించింది.. అతను పోస్ట్ చేసిన చిత్రం వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్ ను ధృవీకరించింది. “స్క్రీన్‌షాట్‌తో కూడిన సమాచారం ఖచ్చితమైనది, ప్రామాణికమైనది. సంబంధిత ప్రాంతంలో ఉన్న నా సహోద్యోగులతో వివరాలను ధృవీకరించిన తర్వాత నేను ఆ సమాచారాన్ని పంచుకున్నాను." అని ల్విన్ మాకు తెలిపారు.

అందువల్ల, వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లోని హిందూ పిల్లలకు సంబంధించింది కాదని మేము నిర్ధారించాము.

Credit: Md Mahfooz Alam

Next Story