నిజమెంత: ఢిల్లీలో కుక్కలను షెల్టర్ హౌస్ లకు తరలించిన వీడియోలు ఇవేనా?
ఆగస్టు 11న, సుప్రీం కోర్టు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆరు నుండి ఎనిమిది వారాల్లోగా తొలగించడం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, శాశ్వతంగా వాటికి ఆశ్రయం కల్పించాలని ఆదేశించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: ఢిల్లీలో కుక్కలను షెల్టర్ హౌస్ లకు తరలించిన వీడియోలు ఇవేనా?
ఆగస్టు 11న, సుప్రీం కోర్టు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆరు నుండి ఎనిమిది వారాల్లోగా తొలగించడం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం, శాశ్వతంగా వాటికి ఆశ్రయం కల్పించాలని ఆదేశించింది. అయితే, ఆగస్టు 14న, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించి, తన ఉత్తర్వును రిజర్వ్ చేసింది. తుది తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉంది.
గోడల మధ్య వందలాది కుక్కలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో వీధి కుక్కలను బంధించి ఇలా షెల్టర్లలో ఉంచారంటూ పోస్టులు పెడుతున్నారు.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు "ఢిల్లీలోని అన్ని కుక్కలు ఇక్కడ ఉంటున్నాయి" అనే శీర్షికతో వీడియోను షేర్ చేస్తున్నారు.
కోర్టు ఆదేశాన్ని విమర్శించే వారిని ఎగతాళి చేస్తూ, ఒక ఎక్స్ యూజర్ వీడియోను షేర్ చేసి, "కుక్కల ప్రేమికులారా, ఇక్కడికి వెళ్లి మీకు కావలసినంత తినిపించండి. మీకు నచ్చితే, ఒక జంటను ఇంటికి తీసుకెళ్లి మీ విదేశీ జాతి కుక్కలకు బదులుగా వాటిని ఉంచండి" అని రాశారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
ఈ వీడియో ఢిల్లీకి సంబంధించింది కాదు. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరం నుండి వచ్చింది. వైరల్ అవుతున్న వాదన అవాస్తవమని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ వీడియోలో, ఆ ప్రదేశం ఇరాక్‌గా గుర్తించినట్లు మేము గమనించాము.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మార్చి 10 నాటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు దారితీసింది. అది ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో 3,00,000 కంటే ఎక్కువ వీధి కుక్కలు ఉన్నాయని పేర్కొంది.
ఈ వీడియోను ఎర్బిల్ శివార్లలోని 'షెల్టర్' అని పిలవబడే ప్రదేశంలో చిత్రీకరించారని, అక్కడ 10,000 కంటే ఎక్కువ కుక్కలను తగినంత ఆహారం లేదా వైద్య సంరక్షణ లేకుండా వదిలివేసినట్లు ఆ పోస్ట్ పేర్కొంది. మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మే 27, 2024న ఇలాంటి వీడియోను షేర్ చేసింది, ఆ ప్రాంతాన్ని ఇరాక్‌లోని ఎర్బిల్ అని అందులో ప్రస్తావించారు.
డిసెంబర్ 12, 2023న ప్రచురించిన ఇరాకీ మీడియా సంస్థ షఫాక్ న్యూస్ నివేదికలో కూడా ఎర్బిల్ షెల్టర్ ఫర్ స్ట్రే యానిమల్స్ కు సంబంధించిన అనేక చిత్రాలు ఉన్నాయి.
ఆ నివేదిక ప్రకారం, అక్టోబర్ నుండి దాదాపు 3,000 వీధి కుక్కలను సేకరించి ప్రత్యేక ఆశ్రయానికి తరలించినట్లు ఎర్బిల్ స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ ఒమేద్ ఖోష్నావ్ మాట్లాడుతూ, ఈ ఆశ్రయం ఆఫ్ఘనిస్తాన్‌లోని బ్రిటిష్ ప్రాజెక్ట్ తరహాలో రూపొందించారని, కుక్కలకు ఆహారం, నీటిని అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఎర్బిల్‌లో వీధి కుక్కల దాడులు 30 శాతం తగ్గాయని, ప్రతిరోజూ దాదాపు 80 కుక్కలను పట్టుకుంటున్నట్లు తెలిపారు.
ఇరాకీ ఫేస్‌బుక్ పేజీ, సోరాన్ మీడియా, నవంబర్ 18, 2023న ఇలాంటి వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో ఎర్బిల్‌లోని వీధి కుక్కలకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశానికి సంబంధించిందని పోస్ట్ పేర్కొంది.
వైరల్ వీడియోలోని దృశ్యాలను ఎర్బిల్ ప్రదేశంగా పేర్కొన్న క్లిప్‌లతో, షఫాక్ న్యూస్ ప్రచురించిన చిత్రంతో పోల్చినప్పుడు అవి ఒకేలా ఉన్నాయని మేము కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ వీడియో ఇరాక్‌లోని ఎర్బిల్ కు సంబంధించిందని మేము నిర్ధారించాము.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Mahfooz Alam