నిజమెంత: ఆ వీడియోకు.. తీవ్రవాది మసూద్ అజర్ హత్యకు లింక్ ఉందా?

జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jan 2024 8:30 AM GMT
NewsMeterFactCheck, Masood Azhar, Dera Ismail Khan

నిజమెంత: ఆ వీడియోకు.. తీవ్రవాది మసూద్ అజర్ హత్యకు లింక్ ఉందా? 

జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయారంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో మసూద్ అజర్ చనిపోయాడంటూ ఓ పేలుడుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అజర్ భవాలాపూర్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన పేలుడులో మరణించాడని.. అందుకు సంబంధించిన పేలుడు వీడియో ఇదే అంటూ పలువురు ఓ రోడ్డులో జరిగిన పేలుడుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు.

"పాకిస్తాన్: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్, భావల్పూర్ మసీదు (sic) నుండి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పేలుడులో మరణించినట్లు నివేదించబడింది" అని వీడియోను షేర్ చేసిన ప్రీమియం X వినియోగదారు రాశారు.

చాలా మంది X వినియోగదారులు కూడా అదే వాదనతో వీడియోను షేర్ చేసారు.

నిజ నిర్ధారణ:

నవంబర్ 3, 2023న పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో డేరా ఇస్మాయిల్ ఖాన్ ట్యాంక్ అడ్డాలో పేలుడుకు సంబంధించిన వీడియో అని న్యూస్‌మీటర్ కనుగొంది.

మసూద్ అజార్ మరణానికి సంబంధించిన వీడియోల కోసం వెతికాము. కానీ జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మరణాన్ని ధృవీకరించిన వార్తా కథనాలు ఏవీ భారతదేశం, పాకిస్తాన్‌లోని విశ్వసనీయ మీడియా సంస్థల నుండి రాలేదు. అతడి మరణం గురించి ధృవీకరించి ఉంటే, అది ప్రధాన స్రవంతి మీడియాలో విస్తృతంగా నివేదించే వారు.

ఆ తర్వాత, మేము వైరల్ వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ప్రీమియం X హ్యాండిల్ OSINT అప్డేట్స్ ద్వారా నవంబర్ 3 2023న పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. క్యాప్షన్‌లో పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు హ్యాండిల్ పేర్కొంది. పేలుడు కారణంగా ఆరుగురు మరణించారని, 25 మంది గాయపడ్డారని, తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని అందులో వివరించారు.

ఈ సూచనను తీసుకొని, మేము Xలో సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. నవంబర్ 3, 2023న పాకిస్తాన్ జర్నలిస్ట్ గులాం అబ్బాస్ షా పోస్ట్ చేసిన అదే వీడియోను కనుగొన్నాము. పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగిందని, పలువురు మరణించారని క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. భారతీయ జర్నలిస్ట్ రవీందర్ సింగ్ రాబిన్ కూడా 3 నవంబర్ 2023న వీడియోను పోస్ట్ చేశారు, అదే విషయాన్ని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

పాకిస్థాన్ మీడియా సంస్థ సమా టీవీ ప్రకారం, పేలుడు పదార్థాన్ని మోటర్‌బైక్‌పై అమర్చారని, రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుడు జరిగిందని ప్రాథమిక నివేదికలో తేలింది. శక్తివంతమైన పేలుడు కారణంగా ఆరుగురు మరణించారని, 20 మందికి పైగా గాయపడ్డారని కూడా పేర్కొంది.

అసోసియేటెడ్ ప్రెస్ కూడా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ అనే నగరంలో పేలుడు జరిగిందని నివేదించింది. నగరం నుండి సమీప ప్రాంతానికి అధికారులను తీసుకెళ్తున్న పోలీసు బస్సు అటుగా వెళ్లినప్పుడు మోటార్‌సైకిల్‌లో అమర్చిన బాంబును రిమోట్‌తో పేల్చారు.

అందువల్ల, మేము ఈ వీడియో పాతదని గుర్తించాం. ఉగ్రవాది మసూద్ అజార్‌ను చంపిన బాంబ్ బ్లాస్ట్ గా నివేదించిన పేలుడుకు సంబంధించినది కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.

Credits : Md Mahfooz Alam

Claim Review:ఆ వీడియోకు.. తీవ్రవాది మసూద్ అజర్ హత్యకు లింక్ ఉందా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story