ముఖంలోని హావభావాలు.. మోసం చేస్తాయి గురూ..!

By అంజి  Published on  18 Feb 2020 10:53 AM GMT
ముఖంలోని హావభావాలు.. మోసం చేస్తాయి గురూ..!

ముఖ్యాంశాలు

  • ఇతరుల ముఖంలోని హావభావాలను నమ్మొచ్చా..?

అసలు నమ్మడానికే వీలు లేదని అంటున్నాయి తాజా సర్వేలు..! నిజమండీ ఒక వ్యక్తి ముఖాన్ని చూసి అతడు మనసులో ఏమని అనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా కష్టమేనని చెబుతున్నారు. ఏదైనా బిజినెస్ కు సంబంధించి కస్టమర్ శాటిస్ఫాక్షన్ అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యమైపోతోంది. అందుకు ముఖంలోని హావభావాలను రివ్యూగా పరిగణిస్తున్నారు.. ఇక్కడ తెలుసుకోవాల్సంది ఏమిటంటే ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్(ముఖంలోని హావభావాలు) ఒకలా ఉంటాయి.. మనసులో మరో రకమైన అభిప్రాయం ఒక్కో వ్యక్తి కలిగి ఉంటాడట. యుఎస్ కు చెందిన ఓహియో స్టేట్ యూనివర్సిటీ చెందిన అలీక్స్ మార్టినెజ్ చేసిన తాజా సర్వేలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ ను అంచనా వేయడానికి రీసెర్చర్లు ప్రత్యేకంగా కంప్యూటర్ ఆల్గరిథమ్ లను రూపొందించారు. మనుషుల ముఖంలో ఉన్న కండరాలలో వచ్చే మార్పుల ఆధారంగా వారి హావభావాలను అంచనా వేశారు. కానీ హావభావాలకు.. మనసులో అనుకుంటున్న దానికి చాలా తేడా ఉందట..! ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన హావభావాలను వ్యక్తం చేస్తాడని.. అది అతడి కల్చరల్ బ్యాగ్రౌండ్ కు సంబంధించిందని మార్టినెజ్ చెబుతున్నారు. వ్యక్తుల నుండి అభిప్రాయ సేకరణ సమయంలో నవ్వుతూ ఉన్నాడంటే అతడు ఆనందంగా ఉన్నాడని అనుకోకూడదని తన రీసర్చ్ ద్వారా తెలియజేశారు. అలాగే అసలు ముఖంపై నవ్వు అన్నది కనిపించకుండా ఉన్న వ్యక్తులు ఆనందంగా లేరని అనుకోవడం తప్పుడు అంచనా అని చెబుతున్నారు. కొందరు కావాలనే నవ్వుతూ ఉంటారని.. అది వారి సామాజిక పరిస్థితులు కూడా కారణం అయి ఉంటాయని చెబుతున్నారు.

కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ లు తయారు చేసి ముఖకవళికల ఆధారంగా కస్టమర్ తమ సర్వీసుతో ఆనందంగా ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారని.. కానీ ఇది వీలు పడే విషయం కాదని మార్టినెజ్ తేల్చేశారు. ఇలాంటి విషయాలన్నీ కేవలం ముఖంలోని హావభావాల కారణంగా తెలుసుకొందామని అనుకోవడం చాలా తప్పు అని అంటున్నారు. ముఖ కవళికలే కాకుండా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటే కానీ ఓ మనిషి ఏమని అనుకుంటున్నాడో కనుక్కోవడం అసాధ్యమని చెబుతున్నారు.

Next Story