ట్రంప్‌కు షాకిచ్చిన పేస్‌బుక్‌, ట్విట్టర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2020 6:57 AM GMT
ట్రంప్‌కు షాకిచ్చిన పేస్‌బుక్‌, ట్విట్టర్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు షాకిచ్చాయి. ఆయన పోస్టు చేసిన పలు వీడియోలను తొలగించాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ సైట్లలో వస్తున్న తప్పుడు సమాచారం పై సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ లు చర్యలు తీసుకుంటున్నాయి. అటువంటి సమాచారం గుర్తించిన వెంటనే వాటని సైట్ల నుంచి తొలగిస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. చిన్నపిల్లలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి ఉంటుందని చెప్పుకొచ్చారు. అమెరికాలో స్కూళ్లను తెరవాలని, పిల్లల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది.. గనుక కరోనా వైరస్‌ సోకదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కాగా.. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తమ సంస్థల నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయంటూ.. ఈ రెండు స్థంసలు పేర్కొన్నాయి. అందుకనే వాటిని తమ సైట్లలోంచి తొలగిస్తున్నటు తెలిపాయి.

"ఒక ప్రత్యేక వయసు వారు కొవిడ్‌-19 రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారనే సమాచారం ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తోంది. మా సంస్థ నిబంధనలకు ఇది విరుద్దం" అని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా.. ట్విట్టర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడానికి ఇంకో మూడు నెలలు సమయం మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో ట్రంప్‌ పోస్టులను ఇవి డిలీట్‌ చేయడం విశేషం.

పిల్లల్లో కూడా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉంటాయని, వాటిని వారు పెద్దలకు, సూళ్లలో టీచర్లకు అంటించే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణలు చెబుతున్నారు.

Next Story