మూతపడ్డ ఫేస్‌బుక్ కార్యాలయం
By తోట వంశీ కుమార్
సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్‌బుక్' లండన్‌లోని తన కార్యాలయాన్ని మూసివేసింది. ఫేస్‌బుక్ ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్-19(కరోనా) వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకు ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది. డీప్ క్లీన్ కోసం శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి తన కార్యాలయాలను మూసివేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.
సింగపూర్‌లో తమ కంపెనీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి.. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు లండన్‌లోని తమ కార్యాలయాన్ని సందర్శించారని, ఆ తర్వాత ఆయనకు కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉద్యోగుల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నట్లయితే వారు వెంటనే ఆస్పత్రి సందర్శించి వైద్య చికిత్స చేయించుకోవాలని, ఆ తర్వాత కోలుకున్నాకే తమ ఆఫీస్‌కి రావాలని సూచించారు. మార్చి 9 సోమవారం వరకు లండన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపారు.