జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐవైఆర్.. ఈసీకి ఆ హక్కుంది..!
By Newsmeter.Network Published on 16 March 2020 10:32 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం రాజకీయ రచ్చను రేపుతుంది. ఎస్‌ఈసీ వర్సెస్ వైకాపా ప్రభుత్వం అన్నట్లు మారింది. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఎన్నికలు ఆరు నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎస్‌ఈసీ నిర్ణయాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించగా.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎస్‌ఈసీకి ఆ హక్కు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వంలో ఉంది మేమా.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమారా అంటూ ప్రశ్నించారు. అంతేకాక చంద్రబాబు నియమించిన వ్యక్తి రమేష్ బాబు అని, ఇద్దరిది ఒకే సామాజిక వర్గమని, చంద్రబాబు కుట్రలో భాగంగానే ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని వెలువరించిందని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ వ్యాఖ్యలను మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా తప్పుబట్టారు. ట్విటర్ వేదికగా జగన్ తీరును ఆయన ఖండించారు. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ఒక్క విషయం తప్పితే.. మిగిలిన అన్ని విషయాల్లో అధికారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని అన్నారు. 151సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగ బద్దంగా నడిచే ప్రభుత్వ విధానంలో సీఎం అధికారాలకు పరిమితులుంటాయన్న మౌలిక సత్యాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి గ్రహిస్తే మంచిదంటూ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.
ఎన్నికల ప్రక్రియ కొనసాగినంత కాలం ఇండ్ల స్థలాల పంపిణీ లాంటి అంశాలను నిలిపివేసే పూర్తి అధికారాలు హేతుబద్దమైన కారణాల మూలంగా ఎన్నికలను వాయిదావేసే అధికారాలు కూడా ఎన్నికల సంఘానికి ఉన్నాయని అన్నారు. రాజ్యాంగ బద్దమైన సంస్థలపై విపరీత ఆరోపణలు చేసే ముందు కొంత ఆలోచించడం ఎందుకైనా మంచిదని, ఈ విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి గుర్తించాలంటూ చురకలు అంటించారు.