కరోనా ఎఫెక్ట్‌: ఆ పరీక్షలన్నీ రద్దు..!

By సుభాష్  Published on  18 March 2020 8:50 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: ఆ పరీక్షలన్నీ రద్దు..!

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం ఇతర రంగాలపైనే కాకుండా విద్యార్థుల పరీక్షలపై కూడా పడుతోంది. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రాలన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాయి. పార్కులు, సినిమాహాళ్లు మూసివేశాయి. అలాగే కొన్ని పరీక్షలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించినా.. కొన్ని పరీక్షలు మాత్రం వాయిదా పడ్డాయి. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా ఏఏ పరీక్షలు రద్దయ్యాయో ఓ సారి చూద్దాం.

విశాఖలోని వైజాక్‌ స్టీల్‌ ప్లాంట్‌ 188 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలు మార్చి 22న ఆన్‌లైన్‌ టెస్ట్‌ జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది అనేది త్వరలో వెల్లడిస్తామని వైజాక్‌ స్టీల్‌ ప్లాంట్‌ విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.

ఇక సెంట్రల్‌ ఎయిర్ మెన్‌ సెలక్షన్‌ బోర్డు -సీఏఎస్‌బీ ఎయిర్‌మెన్‌ స్టార్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు మార్చి 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, కరోనా ఎఫెక్ట్‌ తో ఏప్రిల్‌ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధిత ఆప్‌డేట్స్‌ కోసం https://airmenselection.cdac.in/ వెబ్‌ సైట్‌ను సంప్రదించాలని సూచించింది.

మార్చి 22న ఆదివారం దేశ వ్యాప్తంగా 11క నగరాల్లో నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసు -ఐటీబీపీ వెల్లడించింది. సుమారు 50వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రావాల్సి ఉండగా, వారందరికీ ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందించింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని ఐటీబీపీ అధికార ప్రతినిధి తెలిపారు.

Next Story