రాజధాని మార్పు పై మాజీ మంత్రుల స్పందన
By రాణి
ముఖ్యాంశాలు
- ఇన్ సైడ్ ట్రేడింగ్ పై విచారణ జరపాలన్న మాజీ మంత్రి జవహర్
- నయవంచన శకం ఆరంభమైందన్న యనమల
- ఫ్యాన్ కు మూడు రెక్కలుంటే..రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలా ?
రాజధాని మార్పుపై మాజీ మంత్రులు జవహర్, యనమల రామకృష్ణుడు మాట్లాడారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి జవహర్ అమరావతిని నిర్లక్ష్యం చేయడమంటే..అంబేద్కర్ ఆశయాలను అణగతొక్కినట్లేనని వ్యాఖ్యానించారు. విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గడిచిన 7 నెలల్లో విశాఖలో 50 వేల ఎకరాలు కొన్నారని, దేవాలయాల్లో అన్యమత ప్రచారం పెరిగిపోయిందని ఆరోపణలు చేశారు. ఏపీలో మూడు రాజధానుల పేరుతో వైసీపీ మూడుముక్కలాట ఆడుతోందని దుయ్యబట్టారు.
విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడుతూ...విశాఖపై జగన్ కన్ను పడిందని, అందుకే ఆయనకు అనుకూలంగా మూడు రాజధానులంటూ గుంటనక్క వేషాలేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా రాష్ర్ట అభివృద్ధి జరగాలంటే సంపద ముఖ్యం గానీ..రాజధానులెన్నున్నాయన్నది కాదన్నారు. టీడీపీ హయాంలో బాగా అభివృద్ధి జరిగిందని, పెద్దమొత్తంలో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. మూడు సదస్సులు పెట్టి పెట్టుబడులను ఆకర్షించి, ఐదు లక్షల వరకూ ఉద్యోగాలు కల్పించామన్నారు.
సీఎం జగన్ మాత్రం తన సొంత స్వార్థం చూసుకుంటూ..రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని విమర్శించారు. రాష్ర్ట అభివృద్ధి, సంపదకు మార్గాలు చూడకుండా తన సంపద, తన అనుచరుల ఆస్తులను ఎలా పెంచాలన్న దానిపైనే దృష్టి పెడుతున్నారన్నారు. అమరావతి కేవలం రైతులకు మాత్రమే చెందిన అంశం కాదు..ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశమన్నారు. కడప, బెంగళూరు, హైదరాబాద్ లో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు విశాఖలో కూడా మరో ప్యాలెస్ కడతారా ? వైసీపీ గుర్తు ఫ్యాన్ కు మూడు రెక్కలుంటే రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయడం సరికాదన్నారు. జగన్ సీఎం అవ్వడంతో నయవంశన శకం ఆరంభమైందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని యనమల సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని, వైసీపీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.