యూరోపియన్ యూనియన్ కొత్త ప్రయత్నం

By అంజి  Published on  18 Jan 2020 2:26 PM IST
యూరోపియన్ యూనియన్ కొత్త ప్రయత్నం

యూరోపియన్ యూనియన్ ఈ వారం ఒక కీలక సమావేశం జరపబోతోంది. ఈ సమావేశంలో అతి పెద్ద అంతర్జాతీయ వాణిజ్య సమస్యపైనో, దౌత్యపరంగా చాలా కీలకమైన అంశంపైనే సభ్యదేశాలు చర్చించబోవడం లేదు. అలాగని వారు చర్చిస్తున్నది అపరధానమైన ఇష్యూకాదు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల ప్రతినిధులు ఏ విషయంపై చర్చించబోతున్నారో తెలుసా? యూరోపియన్ యూనియన్ దేశాలన్నిటీ అన్ని రకాల మొబైల్ ఫోన్లకు పనికి వచ్చే ఒక రకమైన సెల్ చార్జర్‌ను రూపొందించడం. టాబ్లెట్లు, ఈ రీడర్లు, మొబైల్స్, డిజిటల్ కెమెరాలన్నిటికీ పనికొచ్చే ఒకే రకమైన చార్జర్‌ను రూపొందించడం చాలా ముఖ్యమని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు బాగా తగ్గుతాయి.

ఒక్క యూరప్ లోనే చార్జర్ల వల్ల 51,000 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇన్నిన్ని చార్జర్లు ఉంటే ప్రపంచ పర్యావరణానికి పెను ముప్పు సంభవిస్తుంది. అందుకే ఈ చార్జర్ల చెత్తకుప్పల్లో మునిగిపోకముందే మేలుకోవడం మంచిదని పోలండ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూరోపియన్ యూనియన్ నేత రోజా థున్ పేర్కొంది. అన్ని మొబైల్స్ కీ ఒకే చార్జర్ ఉంటే ప్రతి మొబైల్ కీ ఒక ప్రత్యేక చార్జర్ కొనాల్సిన అవసరం ఉండదు. మొబైల్స్ ను అమ్మే సమయంలో చార్జర్లు లేకుండా అమ్మవచ్చు. దీని వల్ల వ్యర్థాల ఉత్పత్తి తగ్గుతుంది.

నిజానికి 2008 లోనే యూరోపియన్ యూనియన్ వివిధ ఫోన్లకు నలభై రకాల చార్జర్లు ఎందుకని ప్రశ్నించింది. అప్పట్లో సామ్‌సాంగ్, యాపిల్, నోకియా వంటి సంస్థలను ఒకే చార్జర్ తయారు చేయాలని సూచించింది. ఈ ఒప్పందం 2014 వరకూ అమలులో ఉంది. ఆ తరువాత నుంచి మళ్లీ ఎవరి చార్జర్ వారిదే. ప్రస్తుతం యూఎన్ బీ 2.0మైక్రో, యూఎస్ బీ సీ, యాపిల్ లైటెనింగ్ అనే మూడు రకాల చార్జర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఫోన్లకూ విద్యుత్ ప్రాణం పోసే యూనివర్సల్ చార్జర్ కావాలని యూరోపియన్ యూనియన్ కోరుతోంది. ఈ మేరకు ఒక అధ్యయనాన్ని వెలువరించబోతోంది. దాని ఆధారంగా యూనివర్సల్‌ చార్జర్ ను రూపొందించేందుకు యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు సాగించబోతోంది.

Next Story