ఐరోపా సమాఖ్య అష్ట దిగ్భందనం -కరోనా ఎఫెక్ట్
By అంజి Published on 19 March 2020 3:39 AM GMTసరిగ్గా నిన్నటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 8,092కు చేరింది. ఇక కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన కేసులు 2 లక్షలు దాటాయి. కరోనా వైరస్‌కు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం ఇచ్చే జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఈ వివరాలను వెల్లడించింది. ఆసియా దేశాలలో ఇప్పటి వరకు 3,384 మరణాలు నమోదు కాగా, ఒక్క ఐరోపాలోనే 3,422 మరణాలు చోటుచేసుకున్నాయి.
క్వారంటైన్‌లో ఉన్నవారిలో 82,032 మంది కరోనా నుండి బయటపడినట్లు అది తెలిపింది. కరోనా విస్తృతమవుతున్న నేపథ్యంలో ఐరోపా కూటమి తన సభ్యదేశాల మధ్య సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించటంతో ఆయా దేశాల సరిహద్దు ప్రాంతాలన్నీ కిక్కిరిసి పోతున్నాయి. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ఐరోపాతో పాటు ప్రపంచ దేశాలన్నీసరిహద్దులను మూసివేయటంతో పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతున్నాయి.
రాబోయే రెండుమూడు నెలల్లో ఒక్క జర్మనీలోనే కోటి మంది కరోనా బారిన పడతారన్న హెచ్చరికల నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నెల రోజుల పాటు బయటివారిని రానివ్వకుండా సరిహద్దులను మూసివేయనుండడంతో వేల మంది వెనుతిరగాల్సి వచ్చింది. సమాఖ్యలోని దేశాల మధ్య కూడా రాకపోకలపై ఆంక్షలు నెలకొన్నాయి. దీంతో కొన్ని దేశాల సరిహద్దుల్లో 60 కి.మీ. పొడవునా ట్రాఫిక్ జాంలు కనిపించాయి.
Also Read: కరీంనగర్‌లో కరోనా కలకలం.. రంగంలోకి 100 ప్రత్యేక బృందాలు
తాజాగా బెల్జియం కూడా తమ ప్రజల్ని దేశం విడిచి వెళ్లకుండా నిర్బంధించింది. కరోనా వైరస్ అమెరికాలోని 50 రాష్ట్రాలకు విస్తరించినట్లు తాజా సమాచారం. కాసినోలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. అత్యవసర హోమ్ డెలివరీ సర్వీసులు కొనసాగుతాయన్నారు. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీని కాంగ్రెస్‌కు ప్రతిపాదించేందుకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. రోజుల వ్యవధిలో కాంగ్రెస్‌లో ఆమోదముద్ర వేయించుకుని, రెండు వారాల్లోపు ప్రజలకు చేరేటట్లు చేయాలని భావిస్తున్నారు.