ఆర్టికల్-370 రద్దుపై మోదీ సర్కారుకు అంతర్జాతీయ మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే వివిధ దేశాలు మనదేశానికి అండగా నిలవగా, తాజాగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బృందం మద్దతు పలికింది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై భారత ప్రభుత్వం తీసుకన్న నిర్ణయాన్ని ఈయూ బృందం సమర్దించింది. కశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ఈయూ సభ్యులు పేర్కొన్నారు. కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గ వ్యవహారమని ఈయూ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక్కడి రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పారు. ఇక, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగానే కశ్మీర్ లోయలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఈయూ ఎంపీలు అభిప్రాయపడ్డారు. టెర్రరిజం భారత దేశ సమస్య మాత్రమే కాదని, ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కశ్మీర్ మరో ఆప్ఘనిస్థాన్‌గా మారడం తమకు ఇష్టం లేదన్నారు.

ఆర్టికల్-370 రద్దు తర్వాత అంతర్జాతీయ బృందం తొలిసారి కశ్మీర్‌లో పర్యటించింది. ఈయూ దేశాలకు చెందిన 23 మంది ఎంపీలు, శ్రీనగర్, కశ్మీర్‌లో పర్యటించారు. దాల్ లేక్ అందాలను ఆస్వాదించడంతో పాటు స్థానిక ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకున్నారు. సైనిక విభాగాలతోనూ ముచ్చటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వాస్తవాలపై సమాచా రం సేకరించారు. భారత్‌కు తాము స్నేహితులమని, కశ్మీర్‌లో శాంతి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయూతనందిస్తామని చెప్పారు.

ఇక, ఈయూ ప్రతినిధుల కశ్మీర్ పర్యటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. స్వదేశీ ఎంపీలకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం, విదేశీ ప్రతినిధులను ఎలా అనుమతించిందని నిప్పులు చెరిగాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌లో పరిస్థితులు సరిగా ఉంటే విదేశీ ప్రతినిధులను ఎందుకు పంపారని సూటిగా ప్రశ్నించింది. కశ్మీర్ మనదేశంలో అంతర్భాగం కాదా అని నిలదీసింది. ఈ మేరకు సామ్నా పత్రికలో శివ సేన నాయకత్వం తీవ్ర విమర్శలు చేసింది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యానికి కూడా మోదీ సర్కారు ఒప్పుకోవడం లేదని, అలాంటప్పుడు విదేశీయులను అనుమతించడం దేశంలోని స్వేచ్చపై దాడి చేసి నట్లే అని దుయ్యబట్టింది. భారత ఎంపీలు కశ్మీర్‌లో పర్యటించడానికి అనుమతి ఇవ్వని మోదీ సర్కారు, విదేశీ ప్రతినిధులను ఎందుకు స్వాగతించిందో హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.