వారు వచ్చారు..చూశారు..కశ్మీర్‌పై ఏం చెబుతారు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 12:07 PM GMT
వారు వచ్చారు..చూశారు..కశ్మీర్‌పై ఏం చెబుతారు..?

జమ్మూకశ్మీర్‌కు అంతర్జాతీయ బృందం విచ్చేసింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బృందం కశ్మీర్‌లో అడుగుపెట్టింది. భారీ భద్రత మధ్య ఈయూ ప్రతినిధులు కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. కశ్మీర్ లోయతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈయూ సభ్యులు పర్యటించనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోనున్నారు. టూర్‌లో భాగంగా గవర్నర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలతో భేటీ అవుతారు. ఆర్టికల్-370 రద్దు తర్వాత కశ్మీర్‌కు అంతర్జాతీయ బృందం రావడం ఇదే తొలిసారి. ఈయూ పార్లమెంటరీ సభ్యులు సోమవారం ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా కశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. ఆ క్రమంలో ఈయూ సభ్యుల కశ్మీర్‌ పర్యటనకు కేంద్రం ఓకే చెప్పింది. దాంతో, మొత్తం 27 మంది ఎంపీలు కశ్మీర్‌కు వచ్చారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రపంచం తెలుసుకోవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

మరోవైపు ఈయూ పార్లమెంట్ సభ్యుల కశ్మీర్ పర్యటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. సొంత దేశ ఎంపీలకు అనుమతి ఇవ్వకుండా విదేశీ ఎంపీలకు పర్మిషన్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంతర్జాతీయ బృందం విదేశీ పర్యటన వెనక ఏదో మతలబు దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈయూ టీం పర్యటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story