తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు కావడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా సోకిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు వెల్లడించారు. బెంగళూరులో సాప్ట్‌ వేర్‌ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 24 సంవత్సరాల వయసున్న వ్యక్తికి కరోనా పాటిజివ్‌ వచ్చిందని, ప్రస్తుతం ఆ వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. కరోనా సోకిన వ్యక్తి ఫిబ్రవరి 17న దుబాయ్‌ వెళ్లి నాలుగు రోజుల పాటు హాంకాంగ్‌ వ్యక్తులతో కలిసి పని చేసినట్లు వివరించారు. ఆ తర్వాత దుబాయ్‌ నుంచి బెంగళూర్‌కు విమానంలో వచ్చాడని, బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు.

కరోనా బాధితుడు వచ్చిన బస్సులో 27 మంది ప్రయాణికులున్నట్లు గుర్తించామని, ఆ 27 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఇప్పటి వరకు 80 మందిని గుర్తించామని, వారందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నిన్న ఐదు గంటల సమయంలో గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేసి పుణే ల్యాబ్‌కు పంపిస్తే కరోనా పాటిజివ్‌ వచ్చిందని వివరించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించడంతో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటెల సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా అనుమానితుల కోసం గాంధీ, చెస్ట్‌, ఫీవర్‌ ఆస్పత్రులలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పటికే కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. కరోనాకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.