మసీదులోకి మహిళలూ వెళ్ళచ్చు..!
By అంజి Published on 30 Jan 2020 7:37 AM ISTనమాజ్ చేసుకునేందుకు ముస్లిం పురుషులే కాదు ముస్లిం మహిళలకు కూడా మసీదులోకి ప్రవేశం ఉందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయం తెలియక కొందరు మతపెద్దలు ఫత్వాలను జారీ చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.
శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా వెళ్లొచ్చని గతంలో సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో కొందరు ముస్లిం మహిళలలు తమను కూడా మసీదుల్లోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతించేందుకు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ముస్లిం లా బోర్డు అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీన్ని పరిశీలించనుంది. కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వివిధ మతాలు, మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై ఈ ధర్మాసనం విచారణ చేపడుతున్నది. ఈ సందర్భం లో మసీదుల్లోకి ఆడవాళ్లకు అనుమతిపై సంప్రదాయాలు ఏం చెబుతున్నాయని కోర్టు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును వివరణ అడిగింది. దీనిపై బోర్డు కోర్టుకు సమాచారం అందించింది.
మహిళలు మసీదుల్లోకి వెళ్లకుండా ఇస్లాంలో ఎలాంటి నిషేధమూ లేదని స్పష్టం చేసింది. అయితే ఆ హక్కును వినియోగించుకోవడం ఆమె ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. సామూహిక ప్రార్థనలు లేదా శుక్రవారం నమాజ్‌లో పురుషుల మాదిరిగా మహిళలు విధిగా పాల్గొనాలని ఇస్లాంలో నిబంధన లేదని చెప్పింది. ఇస్లాంలో మహిళకు ప్రత్యేక స్థానం కల్పించారని, ఆమె తన అభీష్టంమేరకు మసీదులో ప్రార్థనలు చేసినా లేదా ఇంటిలో ప్రార్థనలు చేసినా ఒకేవిధమైన ప్రతిఫలం దక్కుతుందని వివరించింది.
వచ్చే నెలలో శబరిమల కేసుతో పాటు ప్రార్థనా మందిరాల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం వంటి పిటిషన్‌లు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఎఐఎంపిఎల్‌బి దాఖలు చేసిన అఫిడవిట్ ప్రాధాన్యత సంతరించుకున్నది.