రివ్యూ : ప్చ్..  మంచి మెప్పించలేకపోయింది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jan 2020 6:44 AM GMT
రివ్యూ : ప్చ్..  మంచి మెప్పించలేకపోయింది..!

ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ "ఎంత మంచివాడవురా". మరి ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఉన్న ఆ కనీస అంచనాలనైనా ఈ చిత్రం అందుకుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో బాలు (కల్యాణ్ రామ్) ఒంటరివాడు అయిపోతాడు.

చుట్టాలు కూడా బాలును ఆదరించకపోవడంతో ఒంటరిగానే బాధను అనుభవిస్తాడు. ఆ బాధలో నుండి ఎదుటివారి బాధను అర్ధం చేసుకోవడం నేర్చుకుంటాడు బాలు. అలా అతను పూర్తి పాజిటివ్ గా మారతాడు. మిగతావాళ్ళలో కూడా పాజిటివ్ నెస్ ను తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం బంధంతో పాటు ఒక తోడు కోరుకునే వాళ్ళ కోసం 'ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్స్ సప్లేయర్' అనే కంపెనీ పెట్టి, బంధం కోసం ఆప్యాయత కోసం ఎదురుచూస్తున్న వారికి వాళ్ళు కోరుకునే ఎమోషన్ ను అందిస్తాడు. ఇలా బాలు వేర్వేరు మ‌న‌స్తత్వాలు, ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తుల జీవితాల్లోకి వెళ్తాడు. అయితే వాళ్ళ బాధను బాలు ఎలా పోగొడతాడు. ఈ క్రమంలో అతనికి వచ్చిన సమస్యలు ఏమిటి ? ఈ మధ్యలో నందిని (మెహ్రీన్)తో అతని లవ్ ట్రాక్ ఎలా కొనసాగింది ? చివరికి బాలు జీవితంలో ఏం సాధించాడు ? అనేది మిగతా కథ.

నటీనటులు :

కళ్యాణ్ రామ్ 'రాముడు మంచి బాలుడు' పాత్రలో డీసెంట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కళ్యాణ్ రామ్ నటన బాగుంది. మెహ్రీన్ ప్రతి ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. వీరిద్దరి సన్నివేశాలే చిత్రానికి ఆకర్షణను తెచ్చిపెట్టాయి. సీనియర్ హీరోయిన్ సుహాసిని ఇంతవరకు ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రనే మరొకసారి చేసారు. పెద్దలు తాతయ్య అమ్మమ్మ పాత్రధారులుతో పాటు మిగిలిన నటినటులు కూడా రొటీన్ పాత్రలతో ఎలాంటి కొత్తధనం లేకుండా ఎప్పటిలాగేనే తమ నటనను ప్రదర్శించారు.

అయితే శరత్ బాబు నటన మాత్రం ఆకట్టుకుంది. ఆయనలోని టైమింగ్ ఇంకా బాగా పలకటం నిజంగా విశేషమే. మొత్తానికి ఈ ఫ్యామిలీ డ్రామాలో పదుల సంఖ్యలో నటులు ఉన్నప్పటికీ ప్రధానంగా హీరోతో పాటు విలన్ గా నటించిన రాజీవ్ కనకాల, సపోర్టింగ్ రోల్ లో మెరిసిన తనికెళ్ల భరణి సినిమా మొత్తంలోనే క్యాస్టింగ్ సైడ్ లో హైలైట్ గా నిలిచారు. తమ ఎక్స్‌పీరియన్స్‌తో సగటు సన్నివేశాలకే కూడా వాళ్ళు సొబగులద్దారు. అలాగే కమెడియన్ ప్రవీణ్‌ క్యారెక్టర్‌ కూడా కాస్త కామెడీకి తోడ్పడింది.

సాంకేతిక విభాగం :

ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్‌ చేస్తూ వచ్చిన ఈ సినిమా ఒక సగటు ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన అంశాలన్నిటిని బ్యాలెన్స్ చేయలేకపోయింది. అయితే కొన్ని ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సీన్స్ తో ఆకట్టుకోవడానికి బాగానే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ రొటీన్‌ వ్యవహారంతో సాగే ట్రీట్మెంట్ అండ్ డైలాగ్స్ వల్ల ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోదు. కలర్‌ఫుల్‌ విజువల్స్‌, అలరించే మ్యూజిక్‌ తో ఫస్ట్‌ హాఫ్‌ డీసెంట్‌ గా నడపటానికి బాగానే మ్యానేజ్ చేశారు. ఓవరాల్ గా ఎమోషనల్‌గా కదిలించే మూమెంట్స్‌ క్రియేట్‌ చేయడంలో దర్శకుడు మూస పోకడలకి పోయాడు, దాంతో ఒరిజినాలిటీ లోపించింది.

ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన గోపిసుందర్ తన నేపథ్య సంగీతంతో చక్కని ఫీల్‌ కలిగించాడు. ఆకట్టుకునే బాణీలు అందించాడు. మంచి సాహిత్యం కూడా కుదరడంతో అన్ని పాటలు వినడానికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా కలర్‌ఫుల్‌గా ఉండడంతో సినిమాకి సాంగ్స్ ప్రధానాకర్షణ అయ్యాయి. ఎడిటర్ పనితనం పర్వాలేదు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ తో పాటు, నిర్మాణ విలువలు కూడా చిత్రాన్ని రిచ్‌ గా తీర్చిదిద్దాయి. పైగా చివరి వరకు ఉండాల్సిన స్థాయిలో బలమైన కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోవడంతో ఈ సినిమా ఒక సగటు సినిమా చూసిన అనుభూతినిస్తుందే తప్ప క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాలోని లక్షణాలు అయితే లేవు.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ రామ్ నటన

సినిమా థీమ్ అండ్ హీరో పాయింటాఫ్ వ్యూ

హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ

ఎమోషనల్ సీక్వెన్సెస్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్

ఇంటర్వెల్ బ్లాక్

మైనస్ పాయింట్స్ :

స్లోగా సాగే కీలక సన్నివేశాలు

పేలవమైన కథనం

కొన్ని సీన్స్ ఇంట్రస్ట్ కలిగించలేకపోవడం

చివరగా..

ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఫ్యామిలీ డ్రామాలు చూసిన ప్రేక్షకులకి ఈ సినిమా కొత్తదనం ఇవ్వకపోయినా.. మంచి క్యారెక్టరైజేషన్స్ తో పాటు ఆహ్లాదభరిత సంగీతం, ఫ్రెష్‌ గా అనిపించే కళ్యాణ్ రామ్ నటన, కనువిందు చేసే వాతావరణం మరియు ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాని నిలబెడతాయి. ఇక పండుగ వేళ ఫ్యామిలీ చిత్రాలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిస్ అవుతుంది.

Next Story