యాక్షన్ కింగ్ అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్ సేన్.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా
Young Hero Vishwak Sen Respond on Arjun Sarja allegations.అర్జున్ తనపై చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు విశ్వక్ సేన్
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2022 8:23 AM ISTయాక్షన్ కింగ్, సీనియర్ హీరో అర్జున్ తనపై చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు యంగ్ హీరో విశ్వక్ సేన్ స్పందించారు. గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హిమాలయాలకు వెళ్లిపోదామని అనుకున్నానని చెప్పారు. ఇండస్ట్రీలో తన లాంటి ప్రొపెషనల్ నటుడు లేరని. అలాంటి తనకు కమిట్‌మెంట్ లేదని.. తాను పని చేసిన చిత్రాల్లోని ఒక్క లైట్ భాయ్ చెప్పినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'రాజయోగం' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్.. ఈ వివాదం గురించి మాట్లాడారు. "నటుడిని అయ్యేందుకు ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఏదో అవకాశం వచ్చింది కదా అని నేను సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటా. షూటింగ్ పూరైన తరువాత ప్రచార బాధ్యతలను భుజాలపై వేసుకుని రోడ్లపై తిరుగుతుంటా. నా అంత కమిటెడ్, ప్రొఫెషనల్ నటుడు ఎవరు ఉండరు. ఈ సంవత్సరం నేను మూడు సినిమాలు చేశా. వాటిలో ఒక చిత్రానికి నేనే దర్శకుడు, నటుడు, నిర్మాత. నా వల్ల ఇప్పటి వరకు ఏ నిర్మాతా బాధపడలేదు. ఒక్క రూపాయి నష్టపోలేదు. నేను చేసిన సినిమాలు చిన్న సినిమాలే కావొచ్చు. కానీ వాటిని నిర్మించిన నిర్మాతలు చాలా పెద్దవారు. నా సినిమాల సెట్‌లోని ఒక్క లైట్‌భాయ్ అయినా.. నన్ను కమిటెట్, ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.
అర్జున్ దర్శకత్వంలో నటించే సినిమాకి వారం ముందు నాకు స్క్రిప్టు అందింది. నేను సినిమాకి నా వంతు ఎఫర్ట్స్ పెట్టి చేద్దామని అనుకున్నా. మా మధ్య సరైన అవగాహన లేదు. ఆ విషయం నేను లేటుగా రియలైజ్ అయ్యాను. నేను సినిమా బాగా రావడానికి మాట్లాడుకుందామని మెసేజ్ పెట్టాను. సెట్ మీద డిస్కర్షన్ రావద్దు అని రెండు రోజులు మాట్లాడుకొని వెళ్దామని చెప్పాను. వాళ్ల మేనేజర్ రెండు రోజుల తరువాత మాకు కాల్ చేసి రెమ్యునరేషన్ వెనక్కి పంపించమని చెప్పాడు. నేను సినిమా నుంచి వైదొలుతానని ఎక్కడా చెప్పలేదు. సినిమాను నేను ఆపలేదు.
నాకు ఇబ్బంది కలిగితే నాలుగు గోడల మధ్యే మాట్లాడా. ఆయనకు అంత గౌరవం ఇచ్చా. ఆయన ప్రెస్‌మీట్ పెట్టడం వల్ల ఇప్పుడు నా ఫ్యామిలీ, స్నేహితులు బాధపడుతున్నారు. నన్ను సినిమా నుంచి తొలగించారు. ఆయన చిత్రం గురించి నేనేందుకు మాట్లాడాలి అనుకున్నా కాబట్టే వెంటనే స్పందించలేదు. అర్జున్ గారు మంచి సినిమా చేయాలి. ఆయన బాగుండాలి. నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్" అని విశ్వక్ సేన్ అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. అయితే.. ఈ చిత్రాన్ని విశ్వక్ ఆపాడని దర్శకుడు, నటుడు అర్జున్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.