రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన న‌టి.. ప‌రిస్థితి విష‌మం

Yashika Anand critical after car accident.రోడ్డు ప్ర‌మాదంలో సినీ న‌టి, బిగ్‌బాస్ ఫేమ్ యాషిక ఆనంద్ తీవ్రంగా గాయ‌ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 10:13 AM IST
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన న‌టి.. ప‌రిస్థితి విష‌మం

రోడ్డు ప్ర‌మాదంలో సినీ న‌టి, బిగ్‌బాస్ ఫేమ్ యాషిక ఆనంద్ తీవ్రంగా గాయ‌ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆమె స్నేహితురాలు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. యాషిక‌తో పాటు మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా.. యాషిక ఆనంద్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. కారు ఢివైడ‌ర్‌కు ఢీ కొట్ట‌డంతోనే ఈ ప్ర‌మాదం జరిగింది. త‌మిళనాడులోని మామల్లపురం సెంటర్ మీడియన్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. యాషిక ఆనంద్‌తో పాటు మ‌రో ముగ్గురు కారులో మహాబలిపురం నుండి చెన్నై వెలుతున్నారు. తమిళనాడు చెన్నైకి సమీపంలోని మామల్లపురం సెంటర్ మీడియన్‌ సమీపంలోకి రాగానే కారు అదుపు త‌ప్పి ఢివైడ‌ర్‌ను ఢీకొట్టింది. డివైడ‌ర్‌కి బ‌లంగా ఢీ కొన‌డంతో కారు ప‌క్క‌న ఉన్న పొలాల్లో ప‌డిపోయింది. కారు ప్ర‌మాదాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే వారిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇద్ద‌రు యువ‌కుల ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌గా.. యాషికా ఆనంద్ ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఘటనా స్థలంలో తీవ్ర గాయాలతో మృతి చెందిన మరో మహిళ హైదరాబాద్‌కు చెందిన వల్లిచెట్టి భవానీ (28)గా గుర్తించారు. మమల్లాపురం పోలీసులు వల్లిచెట్టి భవానీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం సేవించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.

యాషికా ఆనంద్ ఢిల్లీలో పుట్టి.. చెన్నైలో స్థిరపడ్డారు. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2016లో ధురువంగల్ పత్తినారు చిత్రంతో వెండితెర‌పై అరంగ్రేటం చేసింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్‌గా మారింది. అలాగే బిగ్‌బాస్ 3 త‌మిళ సీజ‌న్‌లో పాల్గొని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న అభిమానులు.. ఆమె కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.

Next Story