వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించింది.
By Srikanth Gundamalla
వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి 300 కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది వరకు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చాలా కుంటుంబాలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అయితే.. వయనాడ్ బాధితులకు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతుగా నిధులను ప్రకటిస్తూ.. అండగా నిలబడుతున్నారు.
తాజాగా వయనాడ్ బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ అండగా నిలబడ్డారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. జూలై 30న కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యి.. చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చిరంజీవి ఎక్స్ వేదికగా ఇటీవల తెలిపారు. అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించాడు. కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కూడా విరాళం ఇచ్చారు. అంతకుముందు కల్నల్ హోదాలో హీరో మోహన్ లాల్ వయనాడ్‌లో పర్యటించారు. తన వంతు సాయంగా 3 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.