ప్రేక్షకులకు షాక్.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరల పెంపు
Waltair Veerayya and Veera Simha Reddy ticket prices hike in AP. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు ప్రభుత్వం
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2023 8:52 AM ISTబాక్సాఫీస్ వద్ద రేపటి(గురువారం) నుంచి సంక్రాంతి సీజన్ మొదలు కానుంది. ఈ సారి అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీలను సృష్టిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ రెండు చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని మైత్రీ మూవీ మేకర్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరగా పచ్చజెండా ఊపింది. టికెట్ ధరపై రూ.45 వరకు గరిష్టంగా పెంచుకోవచ్చు. దీనికి జీఎస్టీ అదనం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రూ.70 వరకు పెంచుకుంటామని మైత్రీ మూవీ మేకర్స్ కోరగా.. ప్రభుత్వం మాత్రం రూ.45 వరకు పెంచుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చింది.
మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని ప్రభుత్వం కూడా ఈ రెండు చిత్రాల పట్ల ఉదారంగా స్పందించింది. ఈ రెండు చిత్రాలకు స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆయా చిత్రాల విడుదల రోజున ఎంపిక చేసిన థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రదర్శించుకోవచ్చు.
బాలయ్య నటించిన 'వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటించింది. ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' విడుదల కానుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా ఇందులోనూ శ్రుతి హాసన్ కథానాయిక కావడం విశేషం. విజయ్ నటించిన 'వారసుడు' చిత్రం సంక్రాంతి రేసు నుంచి వెనక్కి వెళ్లడంతో ఇప్పుడు చిరు, బాలయ్య మూవీలకు థియేటర్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.