హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి
Vishal's home attacked by mysterious assailants.హీరో విశాల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 28 Sept 2022 8:34 AM ISTస్టార్ హీరో, నిర్మాత విశాల్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి విశాల్ నివసిస్తున్నారు. ఈ ఇంటిపై సోమవారం రాత్రి ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఎర్ర కలర్ కారులో వచ్చిన దుండగులు ఇంటిపై రాళ్లు రువ్వినట్లు సీసీటీవీ పుటేజీలో కనిపించింది.
ఈ దాడిలో విశాల్ ఇంటి అద్దాలు ధ్వంసం కావడంతో పాటు లైటింగ్ సిస్టమ్ దెబ్బ తిన్నట్టు సమాచారం. దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేడు. షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశంలో ఉన్నాడు. దాడి ఘటనపై విశాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర సంఘం జనరల్ సెక్రటరీగా విశాల్ ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఈయన అంటే గిట్టని వారే ఈ దాడికి పాల్పడ్డారా..? లేక ఇంకేదైన కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విశాల్ నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదల అవుతుంటాయి. తెలుగులో 'పందెం కోడి', 'పొగరు' వంటి చిత్రాలతో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు విశాల్. గతేడాది 'చక్ర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. ప్రస్తుతం విశాల్ 'లాఠీ', 'తుపరివాలన్-2', 'మార్క్ ఆంటోని' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో 'లాఠీ' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.