బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
నేడు ఈడీ విచారణకు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు.
By Knakam Karthik
బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఈడీ విచారణకు సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించింది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రచారం చెయ్యను అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. రానా, విజయ్ దేవరకొండకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వగా తాము విచారణకు హాజరవ్వలేమని, షూటింగ్స్ వలన బిజీగా ఉన్నామని, మరోసారి విచారణకు పిలివాల్సిందిగా కోరడంతో.. విజయ్ దేవరకొండ కు. ఆగష్టు 6 న విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చారు.
రానా కు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసారు. బెట్టింగ్స్ యాప్స్ ప్రచారంలో భాగంగా మనీ లాండరింగ్ జరిగినట్లుగా గుర్తించిన ఈడీ అధికారులు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.
కాగా ఇవాళ విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో ఈడీ విచారణ జరపనుంది. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న రెమ్యూనరేషన్, కమీషన్‌లపై ఆరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే కోణంలో ప్రశ్నించనుంది. నటి నిధి అగర్వాల్ సహా పలువురు సినీరంగానికి చెందిన ప్రముఖులు ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.