సైకిల్ పై వచ్చిన దళపతి.. అభిమానుల సెల్ఫీలతో ఇబ్బంది పడ్డ తలా

Vijay arrives on bicycle.తమిళ సినిమా అభిమానులకు స్టార్ హీరోలైన ఇళయ దళపతి విజయ్, తలా అజిత్ ఓటు హక్కును వినియోగించుకోడానికి వచ్చారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 12:46 PM IST
Vijay, Ajit

తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోడానికి వచ్చారు. ఇక తమిళ సినిమా అభిమానులకు స్టార్ హీరోలైన ఇళయ దళపతి విజయ్, తలా అజిత్ ఓటు హక్కును వినియోగించుకోడానికి వచ్చారు. నటుడు విజయ్‌ చెన్నై నీలంకరైలోని వెల్స్‌ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్‌ మీద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైకిల్ మీద మాస్క్ పెట్టుకుని విజయ్ రాగా.. ఆయన వెనుక పెద్ద ఎత్తున అభిమానులు వెంటపడ్డారు.

తమిళ హీరో అజిత్‌ తన భార్య షాలినీతో కలిసి తిరువాన్మయూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటు వేసి బయటకు వచ్చిన హీరో అజిత్‌తో సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఇబ్బందిపడిన అజిత్‌ ఓ అభిమాని సెల్‌ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అభిమానులపై అజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తొలుత వారిని ఏమీ అనకుండా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు అజిత్ అవకాశం ఇచ్చారు. పోలింగ్‌ బూత్‌ ముందు క్యూ ఉన్నా సెలబ్రిటీ కావడంతో పోలీసులు ఆయన్ను పక్క నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు.

ఓ అభిమాని సెల్ఫీ కోసం పదే పదే ప్రయత్నిస్తుండటంతో హీరో అజిత్‌ అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని ఫ్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మౌనంగా తన ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటపడ్డాడు. అభిమానులు ఓటేయనీయకుండా సెల్ఫీల కోసం ఎగబడటం వల్లే హీరో అజిత్‌ ఈ సెల్‌ఫోన్‌ లాక్కున్నట్లు తెలిసింది. అయితే పోలింగ్ కేంద్రం బయటికి వచ్చాక అభిమానికి సెల్‌ఫోన్ ఇచ్చేసి వెళ్ళాడు.


Next Story