బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Vijay Antony injured on sets of Pichaikkaran 2 in Kuala Lumpur.బిచ్చగాడు చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2023 8:56 AM IST'బిచ్చగాడు' చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో పుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఆరు చిత్రాలు ఉన్నాయి. తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'బిచ్చగాడు' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'బిచ్చగాడు-2' చిత్రం కూడా అందులో ఒకటి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ చిత్రానికి విజయ్‌నే దర్శకత్వం వహిస్తుండడం విశేషం.
ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం బావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురైనట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
కౌలాలంపూర్‌లోని బీచ్‌లో బోటుపై వెలుతున్న ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పడవ అదుపు తప్పి మరో పడవను ఢీ కొట్టింది. ఈ ఘటనలో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పింది.
కాగా.. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులు మలేషియా వెళ్లినట్లు సమాచారం. 'బిచ్చగాడు-2' చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, అజయ్ ఘోష్, యోగి బాబు లు నటిస్తుండగా ఈ చిత్రానికి విజయ్ ఆంటోనినే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేశారు.