సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ గాయ‌ని క‌న్నుమూత‌

Veteran singer Sandhya Mukherjee passes away.సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయ‌ని లతా మంగేష్కర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 2:37 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ గాయ‌ని క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయ‌ని లతా మంగేష్కర్ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రో గొంతుక మూగ‌బోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిగ్గజ గాయని సంధ్య ముఖర్జీ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె మంగ‌ళ‌వారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 91 సంవ‌త్స‌రాలు. ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

దక్షిణ కోల్‌కతాలోని త‌న నివాసంలో గ‌త నెల 27న స్నానాల గ‌దిలో కాలు జారి కింద ప‌డ్డారు. కుటుంబ స‌భ్యులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. ఇటీవ‌ల ఆమెకు చేసిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. అవయవాలు సరిగా పనిచేయకపోవడమే కాక ఎముక విరిగినట్టు కూడా వైద్యులు గుర్తించారు. మంగ‌ళ‌వారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో గుండె పోటుతో ఆమె తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆమె మృతి ప‌ట్ల ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా త‌దిత‌రులు సంతాపం ప్ర‌క‌టించారు.

1931 అక్టోబర్​ 4న బంగాల్​లోని కోల్​కతాలో సంధ్య ముఖర్జీ జ‌న్మించారు. 'అన్జాన్​ గర్హ్'​ సినిమాతో కెరీర్​ ప్రారంభించిన ఆమె ఎస్‌డీ బర్మన్, నౌషాద్, సలీల్ చౌధురి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి ప‌నిచేశారు. ఎన్నో చిత్రాలకు సూపర్​ హిట్​ పాటలు పాడారు. ఈ క్ర‌మంలో బంగ్ బిభూషణ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లోకి ఎక్కారు.

Next Story
Share it