సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. సీనియ‌ర్‌ న‌టి దల్జీత్ కౌర్ క‌న్నుమూత‌

Veteran Punjabi actress Daljeet Kaur Khangura passes away at 69.. ప్ర‌ముఖ పంజాబీ న‌టి దల్జీత్ కౌర్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2022 4:29 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. సీనియ‌ర్‌ న‌టి దల్జీత్ కౌర్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ పంజాబీ న‌టి దల్జీత్ కౌర్ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 69 సంవ‌త్స‌రాలు. గ‌త మూడేళ్లుగా బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో ఆమె బాధ‌ప‌డుతున్నారు. గత ఏడాది కాలంగా కోమాలో ఉన్నారు. ఈ క్ర‌మంలో పంజాబ్‌లోని రాయకోట్‌లో తుదిశ్వాస విడిచారు.

ఆమె మరణ వార్తను ధృవీకరిస్తూ.. నటి నీరూ బజ్వా ఇన్‌స్టాగ్రామ్‌లోకి సంతాపం తెలియ‌జేశారు. "చాలా విచారకరమైన వార్త. రిప్.. దల్జిత్‌కౌర్ జీ.. మీరు ఒక ప్రేరణ, మీరు ఓ లెజెండ్‌.. మీతో కలిసి హీర్రంఝాలో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం అంటూ రాసుకొచ్చారు. ఈ దురదృష్టకర వార్త తెలియగానే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.


సిలిగురిలో 1953లో పుట్టిన ద‌ల్జీత్ కౌర్‌..ఢిల్లీకి చెందిన శ్రీరామ్ మ‌హిళా కళాశాల‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. సినిమాల‌పై ఉన్న ఆస‌క్తిగా పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. 'దాజ్' చిత్రం ద్వారా తెర‌గ్రేటం చేశారు. ఆ త‌రువాత 'గిద్దా', 'పుట్ జట్టన్ దే', 'రూప్ షాకినన్ దా', 'ఇషాక్ నిమాన', 'లాజో', 'వంటి చిత్రాల్లో క‌థానాయిక‌గా నటించి మంచి గుర్తింపు పొందారు. పంజాబీ చిత్ర పరిశ్రమలో 'హేమ మాలిని'గా ప్రసిద్ధి చెందారు దల్జీత్ కౌర్.

రోడ్డు ప్రమాదంలో తన భర్త హర్మిందర్ సింగ్ డియోల్ మరణించిన తర్వాత ఆమె సినిమాలకు విరామం తీసుకుంది. 2001లో ఆమె మళ్లీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె పంజాబీ చిత్రం 'సింగ్ వర్సెస్ కౌర్‌'లో గిప్పీ గ్రేవాల్ తల్లిగా నటించింది.

Next Story