సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి క‌న్నుమూత‌

Veteran Malayalam actress KPAC Lalitha passes away.ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2022 2:56 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. అనారోగ్యంతో సీనియ‌ర్ న‌టి క‌న్నుమూత‌

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రొక‌రు ఈ లోకాన్ని విడిచివెలుతున్నారు. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి కేపీఏసీ లలిత మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె త్రిపుణితుర‌లోని కుమారుడి నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె వ‌య‌స్సు 74 సంవ‌త్స‌రాలు. ఆమె మృతి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమె మృతిపై "రెస్ట్ ఇన్ పీస్ లలితా ఆంటీ! మీతో వెండితెరను పంచుకోవడం ఒక అదృష్టం! నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు. #KPACLalitha" అంటూ ట్వీట్ చేశారు. సంతాపం తెలిపిన వారిలో కీర్తి సురేష్‌, మంజూ వారియర్ వారియ‌ర్‌లు కూడా ఉన్నారు.

కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. ఐదు ద‌శాబ్ధాల సినీ కెరీర్‌లో 550పైగా చిత్రాల్లో న‌టించారు. 'కొడియెట్టం', 'చట్టాంబికళ్యాణి', 'రాజహంసం', 'సన్మానస్సులవర్కు సమాధానం', 'వియత్నాం కాలనీ', 'మణిచిత్రతాఝు' మరియు 'అనియతిప్రవు' వంటి చిత్రాలలో లలిత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'అమరం' (1990) మరియు 'శాంతమ్' (2000) చిత్రాలలోని ఆమె న‌ట‌న‌కు గాను రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. అంతేకాకుండా నాలుగు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. 2009 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఆమె ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు కూడా పొందారు. ఆమె అనారోగ్యానికి గుర‌య్యే వ‌ర‌కు కేర‌ళ సంగీత నాట‌క అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్‌గా ప‌నిచేశారు.

కేపీఏసీ లలిత దివంగత మలయాళ చిత్రనిర్మాత భరతన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ సంతానం. సిద్ధార్థ్ భరతన్ కూడా ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తున్నారు.

Next Story
Share it