చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ చలనచిత్ర దర్శకుడు జో సైమన్ (80) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరులోని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరైన సమయంలో ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని మల్లిగే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
1946లో మండ్యలో జన్మించిన జో సైమన్, 1967లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. నటుడిగా, దర్శకుడిగా, గీత రచయితగా 100కు పైగా చిత్రాల్లో పనిచేశారు. 'సాహస సింహ', 'సింహ జోడి', 'హాంగ్ కాంగ్ నల్లి ఏజెంట్ అమర్', 'స్నేహద కడలలి', 'రవివర్మ', 'మహా ప్రచండరు' మరియు 'టైం బాంబ్' వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన రూపొందించారు. దివంగత లెజెండరీ నటులు విష్ణువర్ధన్ , అంబరీష్‌లతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. రవి వర్మ, మణి, టైమ్ బాంబ్ వంటి సినిమాల్లో సైమన్ నటించారు.
జో సైమన్ మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక కన్నడ మరియు సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పందిస్తూ.. "కన్నడ చిత్ర పరిశ్రమ ఒక డైనమిక్ మరియు సృజనాత్మక దర్శకుడిని కోల్పోయింది. ఆయన ఎంతోమంది కొత్త టాలెంట్‌ను పరిశ్రమకు పరిచయం చేశారు" అని కొనియాడారు. సైమన్ మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ విచారం వ్యక్తం చేశారు.