చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితాశ్వ ప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన వయోసహజమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
తుమకూరు జిల్లా తొండగేరె గ్రామానికి చెందిన ఆయన సినిమాల్లోకి రాకముందు ఓ కాలేజీలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. సినిమాలపై మక్కువతో ఇండ్రస్టీకి వచ్చారు. ఏకే47', 'దాదా', 'దేవ', 'నీ బరేడ కాదంబరి సంగ్లియానా' వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు 500 పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా బుల్లితెరపైన సందడి చేశారు. అంతిమ రాజా', 'గ్రుహంబంగ', 'మాల్గుడి డేస్' వంటి సీరియల్స్‌లో నటించి కన్నడ ప్రేక్షకుల హృదయాలకు మరింత చేరువ అయ్యారు.
ఆయన కుమారుడు శరత్ లోహితస్వ సైతం తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో సైతం అఖండ, సాహూ, అరవింద సమేత లాంటి చిత్రాల్లో నటించారు.