మరో విషాదం.. రష్యా దాడుల్లో గాయపడిన ఉక్రెయిన్ బ్యాలెట్ డ్యాన్సర్ మృతి
Ukraine Ballet Star Artyom Datsishin Dies From Russian Shelling Injuries.ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక దాడి
By తోట వంశీ కుమార్
ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో ఈ యుద్దం ఆగేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు అక్కడి నివాస భవనాలపై దాడులకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్‌లోని ఓ బిల్డింగ్‌పై రష్యా సేనలు చేసిన రాకెట్ దాడిలో ప్రముఖ నటి ఒక్సానా షెవెట్స్ మృత్యువాత పడిన విషయాన్ని జీర్ణించుకోలేకముందే మరో విషాదం చోటు చేసుకుంది. రష్యా దాడుల్లో మరో కళాకారుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఉక్రేనియన్ బ్యాలెట్ డ్యాన్సర్ ఆర్టియోమ్ దట్సిషిన్ మృతి చెందాడు. ఫిబ్రవరి 26న రష్యా దళాలు జరిపిన దాడిలో ఆర్టియోమ్ దట్సిషిన్ తీవ్రంగా గాయపడ్డారు. కీవ్‌లోని ఓ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. గురువారం అతడి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని నేషనల్ ఒపెరా హౌస్ ఆఫ్ ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు. ఆర్టియోమ్ దట్సిషిన్ వయస్సు 43 సంవత్సరాలు . ఆయన అంత్యక్రియలను కీవ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆర్టియోమ్ దట్సిషిన్ ఓ అద్భుత కళాకారుడు అని, అతడిని అందరూ ఇష్టపడతారని, అతడు ఇక లేడనే వార్త ఎంతో బాధను కలిగిస్తోందని మాజీ కళాత్మక దర్శకుడు అలెక్సీ రాట్‌మాన్‌స్కీ తన పేస్‌బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కీవ్ నగరంలో 222 మంది మరణించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇందులో 60 మంది పౌరులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఇక యుఎన్ హక్కుల కార్యాలయం ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు 816 పౌర మరణాలను ధృవీకరించింది.






